Telugu Global
National

 మెదక్ నుంచి ప్రియాంక పోటీ ?

“తెలంగాణలో నానాటికి దిగజారిపోతున్న కాంగ్రెస్ కు పునరుజ్జీవనం పోయాలి. అధికారంతో, అహంకారంతోనూ రాజకీయాలను నానాటికి కలుషితం చేస్తున్న అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి బుద్ధి చెప్పాలి. ఇది జరగాలంటే ఒక భారీ కుదుపు రావాలి. ఇందుకోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల కుటుంబం నుంచి ఎవరో ఒకరు తెలంగాణ నుంచి పోటీ చేయాలి” ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయంగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో నానాటికి బలపడడం, ఇక్కడ మరే రాజకీయ పార్టీ […]

 మెదక్ నుంచి ప్రియాంక పోటీ ?
X

“తెలంగాణలో నానాటికి దిగజారిపోతున్న కాంగ్రెస్ కు పునరుజ్జీవనం పోయాలి. అధికారంతో, అహంకారంతోనూ రాజకీయాలను నానాటికి కలుషితం చేస్తున్న అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి బుద్ధి చెప్పాలి. ఇది జరగాలంటే ఒక భారీ కుదుపు రావాలి. ఇందుకోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల కుటుంబం నుంచి ఎవరో ఒకరు తెలంగాణ నుంచి పోటీ చేయాలి” ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయంగా తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో నానాటికి బలపడడం, ఇక్కడ మరే రాజకీయ పార్టీ బల పడకుండా ఉండేందుకు చేస్తున్న రాజకీయ కుట్రలను అడ్డుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సీరియస్ నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణకు చెందిన సీనియర్ నాయకులు కొందరు రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పినట్లు సమాచారం.

పార్టీ మనుగడను దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనూ, ఇతర దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ బలపడాలి అంటే ఇందిరా గాంధీ వారసులలో ఎవరో ఒకరు తెలంగాణ నుంచి పోటీ చేయాలని పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీకి సూచించినట్లు చెబుతున్నారు.

కాంగ్రెస్ నాయకులు చేసిన ఈ సూచన పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒకింత సానుకూలంగానే స్పందించినట్లు చెబుతున్నారు. తాను గాని, తన తల్లి సోనియాగాంధీ గాని తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం లేదని, పార్టీ సీనియర్లతోను, తన కుటుంబ సభ్యులతో మాట్లాడి సోదరి ప్రియాంక గాంధీని తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు ప్రయత్నిస్తానని రాహుల్ గాంధీ అన్నట్లు సమాచారం.

గతంలో మెదక్ నియోజకవర్గం నుంచి మాజీ ప్రధాని, లేడీ టైగర్ ఇందిరా గాంధీ పోటీ చేశారని, ఆమె పట్ల కానీ ఆ కుటుంబం పట్ల గాని మెదక్ ప్రజలకు ఇంకా ఆదరాభిమానాలు, ప్రేమ ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి గుర్తు చేసినట్లు చెబుతున్నారు.

ప్రియాంక గాంధీకి తన నానమ్మ ఇందిరా గాంధీ పోలికలు ఉండడం, ఆమె నడవడిక కానీ, ప్రసంగాలు కానీ ఇందిరా గాంధీని పోలినట్లుగా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆశిస్తున్నారు.

ఈ లోక్ సభ ఎన్నికలలోనే ప్రియాంక గాంధీని మెదక్ నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని, ఆమె అక్కడి నుంచి పోటీ చేస్తే దాని ప్రభావం కనీసం పది లోక్ సభ నియోజకవర్గాలపై పడి అత్యధిక స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ తెలంగాణ నాయకులు అంచనా వేస్తున్నారు. నానాటికి బలం తగ్గిపోతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీ రాకతో జవజీవాలు తీసుకు వచ్చినట్లుగా ఉంటుందని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  11 March 2019 11:11 PM GMT
Next Story