చిరంజీవి పై కేసు కొట్టేసిన హైకోర్ట్

2014 ఎన్నికల సమయానికి చిరంజీవి క్రియాశీలక రాజకీయాల్లో చురకుగా పాల్గొన్నారు. ఆయన అప్పట్లో ప్రచారం సాగిస్తున్న సమయం లో గుంటూరు లో ని అరండల్‌పేట లో ఎన్నికల నియమావళి ని ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ కేసు గత ఐదు సంవత్సరాలు గా నడుస్తున్నా, మొత్తానికి ఏపీ హైకోర్టు తెర దించుతూ కేసును కొట్టేసింది.

న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజనీ ఉత్తర్వులను జారీ చేసారు. ఆయన పై మోపిన అభియోగం ప్రకారం చిరంజీవి 2014 ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ రాత్రి 10 గంటల తరువాత కూడా ప్రచారం చేసారు. అయితే చిరంజీవి దానిని ఖండిస్తూ కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

చిరంజీవి వాదన ప్రకారం ఆయన ఆ రోజు ప్రచారం పూర్తి చేసుకొని తిరిగి వస్తున్నప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే విషయాన్ని చిరంజీవి తరఫు సీనియర్‌ న్యాయవాది పి.గంగయ్య నాయుడు కోర్టుకు తెలిపారు. అన్ని వివరాలు పరిగణనలోకి తీసుకొని, విచారణ అనంతరం ఈ కేసును ఇప్పుడు కోర్టు కొట్టేసి చిరంజీవి కి ఊరట ని ఇచ్చింది.