అనంత ఓటమికి జేసీ ఒక్కడు చాలు….

ఎవరైనా ఏదైనా ఆటలోనో…. యుద్ధంలోనో… మరో పోరాటంలోనో అద్భుతంగా రాణిస్తే… అలాంటి వారిని వీరుడు… ధీరుడు… పోరాటయోధుడు… అతడు ఒంటిచేత్తో గెలిపిస్తాడు అని అంటారు. అతనొక్కడే బరిలో ఉంటే ఆ జట్టుకు ఇక తిరుగు ఉండదు అంటారు. “ అతను ఉన్నాడులే మనకేంటి” అనే ధీమా కూడా వ్యక్తం చేస్తారు.

తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లాలో ఇది పూర్తిగా రివర్స్ గా మారింది. “అనంతపురం జిల్లాలో జెసి దివాకర్ రెడ్డి ఉన్నారు. మన ఓటమి ఖాయం” అని తెలుగుదేశం నాయకులు, ప్రజాప్రతినిధులు, టిక్కెట్లు వచ్చినవారు బహిరంగంగానే చెబుతున్నారు.

అంతేకాదు అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఒంటి చేత్తో ఓడించే ఏకైన నాయకుడు జె.సి.దివాకర్ రెడ్డి అంటూ… ” ఆడు ఓడించడం ఖాయంరా నాయకా” అని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాశనం కోసమే ఆయన కంకణం కట్టుకున్నట్లు గా ఉందని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.

ఎందుకో తెలియదు గానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేనట్లుగా జెసి దివాకర్ రెడ్డికి భయపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. గడచిన రెండు సంవత్సరాలుగా జెసి దివాకర్ రెడ్డి అనంతపురం జిల్లా తెలుగుదేశం రాజకీయాలను శాసిస్తున్నాయి.

తన కుమారునికి టిక్కెట్ ఇవ్వాలని, తాము చెప్పిన వారికే జిల్లాలో టికెట్లు ఇవ్వాలని షరతులు విధిస్తున్నారు. దీంతో ఇప్పటికే జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకులు పార్టీ పైనా, అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పైనా నిప్పులు చెరుగుతున్నారు. జెసి దివాకర్ రెడ్డి మాట ఎందుకు వింటున్నారో తెలియడం లేదంటూ తలలు పట్టుకుంటున్నారు.

జిల్లాలో 40 నుంచి 50 శాతం మంది ఎమ్మెల్యేలను మార్చేయాలని జెసి దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అల్టిమేటం కూడా ఇచ్చారు. జేసీ దివాకర్ రెడ్డి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తారసిల్లిన జిల్లాకు చెందిన నాయకురాళ్లు శమంతకమణి, యామిని బాలలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితమే ఎమ్మెల్సీగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన శమంతకమణి అయితే జేసీ తీరుతో కన్నీటి పర్యంతమయ్యారు.

దీంతో అక్కడే ఉన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తో సహా సీనియర్ నాయకులు అందరూ ఆమెను ఓదార్చారు. అనంతపురం జిల్లాలోని సింగనమల శాసనసభకు తాను సూచించిన శ్రావణికే  టిక్కెట్టు ఇవ్వాలని, మధ్యలో మీ ఇద్దరు ఎందుకు వచ్చారంటూ శమంతకమని, యామిని బాలల పై విరుచుకు పడ్డారు.

ఈ హఠాత్పరిణామంతో వారిద్దరితో సహా అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ బెంబేలెత్తిపోయినట్లు చెబుతున్నారు. అంతపురం జిల్లాకు చెందిన నాయకులు ఈ పరిణామాన్నితెలుసుకుని జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓటమికి ఒక్క జె.సి.దివాకర్ రెడ్డి ఉంటే సరిపోతుందని, ఆయన కారణంగా జిల్లాలో పార్టీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయం అని అంటున్నారు.