పవన్ కు టిక్కెట్లపై లెక్క ఉంది… వామపక్షాల తిక్క కుదురుతుంది…!

“వెండితెరపై గబ్బర్ సింగ్ కు తిక్కుంది… దానికి కూడా ఓ లెక్కుంది. ఆ పాత్రను పోషించిన పవన్ కళ్యాణ్ కు…. నిజ జీవితంలో కూడా కాసింత కాదు చాలా ఎక్కువ తిక్కుంది. ఆయన అభిమానులు మాత్రం దానికి లెక్క ఉంది అంటున్నారు. ఈ తిక్క… ఆ లెక్కలతో మా ప్రాణం మీదకు వచ్చింది” ఇవీ వామపక్షాలకు చెందిన సీనియర్ నాయకుల మాటలు.

ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే… ఆయా పార్టీలకు చెందిన నాయకులతో బేరీజు వేస్తే ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ కు, ఆయన రాజకీయ పార్టీ జనసేన కు చాలా తేడా ఉందని వామపక్షాల నాయకులు ఎన్నోసార్లు భావించారు.

అయితే ఇదంతా తమ తప్పుడు అంచనాలని, ఇతరులకూ ఆయనకు మధ్య మాటలే తప్ప చేతల్లో మాత్రం రెండూ సేమ్ టు సేమ్ అని తెలుసుకోలేక పోయామని వామపక్షాలకు చెందిన సీనియర్ నాయకులు చెబుతున్నారు.

రానున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో జనసేన తో కలిసి పోటీ చేయాలని వామపక్షాలు నిర్ణయించుకున్నాయి. గడచిన రెండు సంవత్సరాలుగా జనసేన తో కలిసి పలు కార్యక్రమాలు కూడా చేపట్టారు వామపక్షాలకు చెందిన నాయకులు.

ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. సరిగ్గా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ చర్యలు తమను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయంటున్నారు వామపక్షాల నేతలు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీ ప్రకటించడం, నామినేషన్ల గడువు కూడా దగ్గరకు వస్తుండడంతో వామపక్షాల్లో సీట్ల గుబులు ఎక్కువవుతోంది. జనసేన పార్టీతో కలిసి పోటీ చేయాలనుకుంటున్న వామపక్షాలకు పవన్ కళ్యాణ్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రావటం లేదు.

వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం ఎక్కడ నుంచి పోటీ చేస్తాయన్న అంశంపై క్లారిటీ రావడం లేదు. నిజానికి ఈ సందేహాలను పోగొట్టాల్సిన పవన్ కళ్యాణ్ వారికి ఎన్ని సీట్లు కేటాయిస్తారో కూడా ఇప్పటి వరకు తేల్చడం లేదు.

పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, ఆచంట, పోలవరం, ఏలూరు స్థానాలు తమకు కేటాయించాలని సిపిఎం పట్టుబడుతోంది. ఇక సీపీఐ విజయవాడ, కర్నూలు, విశాఖ ఏజెన్సీ తో సహా అనంతపురం జిల్లాలోని కొన్ని స్థానాలను కేటాయించాలని కోరుతోంది. వామపక్షాలు ఇస్తున్న ఈ లెక్కల పట్ల పవన్ కళ్యాణ్ సానుకూలంగా లేరని, ఎన్నికలపై ఆయనకు ఓ లెక్క ఉందని జన సైనికులు చెబుతున్నారు.

ఇన్నాళ్ల తమ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీతోనూ అనుభవించని టెన్షన్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన తో అనుభవిస్తున్నామని వామపక్షాలకు చెందిన సీనియర్ నాయకులు వాపోవడం కొసమెరుపు.