రాధాపై సోదరుడు తిరుగుబాటు

టీడీపీలో చేరిన వంగవీటి రాధాపై సోదరుడు వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధా టీడీపీలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలోని రాఘవయ్య పార్కు వద్ద ఉన్న రంగా విగ్రహం వద్ద వంగవీటి నరేంద్ర దీక్షకు దిగారు. అయితే పోలీసులు దీక్షను భగ్నం చేశారు.

రంగా హత్యకు కారణమైన టీడీపీలో రాధా చేరడం బాధగా ఉందన్నారు. గతంలో రంగా సతీమణి రత్నకుమారి చేసిన తప్పునే
ఇప్పుడు రాధా చేశారని నరేంద్ర మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం సొంత తండ్రి ఆశయాలను వదిలేసిన వ్యక్తి రాధా అని విమర్శించారు.

రంగా హత్య వెనుక టీడీపీ, చంద్రబాబు ప్రమేయం లేదంటూ రాధా చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాధా చర్యతో రంగా అభిమానులంతా క్షోభిస్తున్నారని నరేంద్ర వ్యాఖ్యానించారు. రంగాను హత్య చేసింది ముమ్మాటికీ టీడీపీ ప్రభుత్వమేనని నరేంద్ర ఆరోపించారు.