అల్లం త్రిదోషహరిణి

త్రిదోషాలు అంటే వాతము, పిత్తము, కఫము అని అర్థం. వీటి మూడింటికి విరుగుడు అల్లం. దీనిని అల్లం, అద్రక్, జింజర్ అని కూడ అంటారు. ఇది త్రిదోషహరిణిగా పిలుస్తారు. కొద్దిగా కారంగా ఉంటుంది.

  • మన ఆహారంలో నిత్యం అల్లం ఉంటే ఎటువంటి రోగం దరిచేరదు. పైత్యము, అజీర్ణం వంటివి దరిచేరవు.
  • మలబద్దకము ఉన్నవారికి అల్లం దివ్య ఔషదం.
  • అల్లం, బెల్లం కలిపి తింటే అరచేతులు, అరికాళ్లలో పొరలు ఊడడం తగ్గిపోతుంది.
  • జ్వరం వచ్చి తగ్గిన తర్వాత నాలుకకు రుచిపోతుంది. అలాంటప్పుడు కొద్దిగా అల్లం, నిమ్మకాయలో వేసుకుని చప్పరిస్తే నాలుకకు రుచి వస్తుంది.
  • గొంతు పొడి ఆరిపోయినా, కఫము చేరినా సరే కొద్దిగా అల్లం బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే, కఫము ఆర్చుకుపోతుంది.
  • గొంతుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లయితే కొద్దిగా అల్లంతో రసం చేసుకుని తాగినా లేక అన్నంలో కలుపుకుని తిన్నా వెంటనే ఉపశమనం కలుగుతుంది.
  • అల్లం టీ తాగితే మనసు చురుకుగా ఉంటుంది.
  • సాధ్యమైనంత వరకూ అల్లాన్ని నిత్యం మన ఆహారంలో భాగం చేసుకోవాలి.
  • కొంత మంది అజీర్ణంతో పాటు గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో బాధపడుతుంటారు. అలాంటి వారు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని నిమ్మకాయ రసంలో తగినంత ఉప్పు వేసుకుని ఒక రోజంతా నానపెట్టాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని నిమ్మకాయ రసం ఇగిరిపోయేంత వరకూ ఎండలో పెట్టి, ఆ ముక్కలను ఓ సీసలో నిల్వ చేసుకుని రోజూ పరిగడుపునే చప్పరిస్తే అజీర్ణం, గ్యాస్ట్రిక్ ట్రబుల్, మలబద్దకం వంటి సమస్యలు ఉండవు.
  • అల్లం తేనెలో వేసుకుని అవి బాగా నానిన తర్వాత రోజూ చప్పరిస్తే పైత్యంతో కూడిన సమస్యలు ఉండవు.