నెట్టింట్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సీన్స్…. ఇదంతా ఆర్జీవి ప్లానేనా?

కాంట్రవర్సీ లకు కేరాఫ్ అడ్రస్ గా వ్యవహరించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ త్వరలో ఎన్టీఆర్ బయోపిక్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చి 22వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన రెండు ట్రైలర్ లు చూస్తే ఈ సినిమాలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్య విలన్ గా కనిపించనున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఒకవైపు తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు సినిమా విడుదలను వాయిదా వేయించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా మరోవైపు రాంగోపాల్ వర్మ మాత్రం ఏమీ పట్టనట్లు తన పని తను చేసుకు పోతున్నాడు.

అయితే తాజాగా ఈ సినిమా లో కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అధికారికంగా ట్రైలర్ ద్వారా విడుదల చేసిన కొన్ని సన్నివేశాలు కాకుండా ఈ చిత్రం నుండి కొన్ని సీన్లు నెట్టింట్లో హడావిడి చేస్తున్నాయి.

ఈ వీడియోను ఎవరు లీక్ చేశారు అనే విషయంపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. ప్రమోషన్ల పేరుతో రాంగోపాల్ వర్మ తన సినిమాను హైలైట్ చేయడానికి చాలానే స్ట్రాటజీ లను వాడతారు. ఈ నేపథ్యంలోనే కావాలనే కొన్ని సీన్లను సోషల్ మీడియాలో లీక్ చేసి సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నాడని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.