అనుమానాలున్నాయి… సీబీఐ దర్యాప్తు జరగాలి

వైఎస్‌ వివేకానందరెడ్డి మృతిపై లోతుగా దర్యాప్తు జరపాలని వైసీపీ డిమాండ్ చేసింది. చంద్రబాబు వేసిన సిట్‌పై తమకు నమ్మకం లేదన్నారు. సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.

పులివెందులలో ఈసారి గెలిచి తీరుతామని…. ఎలా గెలుస్తారో చూస్తామంటూ టీడీపీ మంత్రులు చెబుతూ వచ్చారని…. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా మరణం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు.

జమ్మలమడుగు ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డిని ఎంపిక చేసినప్పుడే మహా కుట్రకు నాంది పడిందన్నారు. వైఎస్ వివేకా మరణంపై అన్ని విషయాలు బయటకు రావాలంటే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలన్నారు.

ఐదేళ్లుగా టీడీపీ శక్తులన్నీ కడప జిల్లాను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నాయన్నారు. పులివెందులలో కూడా గెలుస్తామని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకపోతే వెంటనే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని ఆమె డిమాండ్ చేశారు.