కారు టార్గెట్ రేవంత్… కొండా!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్ర సమితి తన వ్యూహాలకు పదును పెడుతోంది.

తెలంగాణలో మజ్లిస్ సీటుతో సహా 17 లోక్ సభ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు లోక్ సభ నియోజకవర్గాలలో సభలు సమావేశాలు నిర్వహించి తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేసే 16 స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలన్నది పార్టీ అధిష్టానం నిర్ణయం. దీంతోపాటు పార్టీ ఎంపీగా గెలిచి శాసనసభ ఎన్నికల సమయంలో హఠాత్తుగా కాంగ్రెస్ లో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ప్రతి సమయంలోనూ పార్టీని ఇరుకున పెట్టాలి అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డిలను భారీ స్థాయిలో పరాజయం పాలయ్యేలా తెలంగాణ రాష్ట్ర సమితి పావులు కదుపుతోంది.

తెలంగాణ ముందస్తు ఎన్నికలలో కొడంగల్ నుంచి శాసనసభకు పోటీ చేసిన రేవంత్ రెడ్డిని భారీ మెజార్టీతో ఓడించిన తెలంగాణ రాష్ట్ర సమితి లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆయనకు అదే స్థాయి పరాజయం తిరిగి చూపించాలని నిర్ణయించింది.

రాజధానిలోని మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నియోజక వర్గంలో సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉండడంతో రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.

అయితే నియోజక వర్గంలో ఉన్న సెటిలర్లు అందరు తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు పలుకుతారనే విషయాన్ని రుచి చూపించాలని టిఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. దీంతో ఇక్కడి బాధ్యతలను మాజీ ఎంపీ, తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి భావిస్తోంది.

ఇక పార్టీ నుంచి చివరి క్షణాల్లో కాంగ్రెస్ లో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కూడా ఓడించేందుకు సర్వ శక్తులు ఒడ్డాలని పార్టీ నిర్ణయించింది. ఆయనపై ఇటీవలే కాంగ్రెస్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి ని పోటీలో దింపుతున్నారు. యువకుడిగా మంచి పేరున్న కార్తీక్ రెడ్డి ఈ ఎన్నికల్లో విజయం సాధించి కొండా విశ్వేశ్వర రెడ్డికి గుణపాఠం చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం భావిస్తోంది.

మల్కాజ్ గిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయడమే కాకుండా ఆ ఇద్దరు నాయకులను కూడా రాజకీయంగా భూస్థాపితం చేయాలన్నది తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వ్యూహంగా చెబుతున్నారు.