పోర్చుగల్ షెడ్యూల్ వాయిదావేసిన మన్మధుడు

లెక్కప్రకారం మన్మధుడు-2 సినిమా షెడ్యూల్ ఈపాటికి స్టార్ట్ అవ్వాలి. ముహూర్తం షాట్ కొట్టేసి ఆ వెంటనే పోర్చుగల్ వెళ్లిపోవాలని యూనిట్ ప్లాన్ చేసింది. మ్యాగ్జిమమ్ షెడ్యూల్ పోర్చుగల్ లోనే పూర్తిచేయాలని అనుకున్నారు. కానీ అనుకున్న టైమ్ కు ఆ సినిమా స్టార్ట్ అవ్వలేదు. దీనిపై యూనిట్ కూడా నోరు విప్పలేదు.

ఎట్టకేలకు ఈ సినిమాపై చిన్న అప్ డేట్ వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 25న మన్మధుడు-2 సినిమా లాంఛ్ అవుతుంది. అయితే అంతా అనుకుంటున్నట్టు లాంఛ్ తర్వాత సినిమా యూనిట్ పోర్చుగల్ వెళ్లడం లేదు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోస్ లోనే వచ్చేనెల 11 వరకు ఫస్ట్ షెడ్యూల్ చేయాలని నిర్ణయించారు.

ఆ తర్వాత పోర్చుగల్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సినిమా లేట్ అవ్వడానికి ప్రధాన కారణం, పోర్చుగల్ అధికారుల నుంచి అనుమతులు రాకపోవడమే అని తెలుస్తోంది.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నాగ్ సరసన పాయల్, రకుల్ హీరోయిన్లుగా నటించబోతున్నారు. సినిమాలో నాగ్ కు భార్యగా రకుల్ నటిస్తుందట. నాగ్ ప్రేయసిగా పాయల్ కనిపించబోతోందట.