ముసలమ్మగా సమంత…. షూటింగ్ పూర్తి

సమంత లీడ్ రోల్ పోషిస్తున్న సినిమా ఓ బేబీ. కొరియన్ లో సూపర్ హిట్ అయిన మిస్ గ్రానీకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నిన్నటితో టోటల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇందులో 20 ఏళ్ల పడుచు పిల్లగా, 70 ఏళ్ల ముసలావిడగా సమంత రెండు పాత్రల్లో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సమంత సరసన నాగశౌర్య హీరోగా నటించాడు. నందినీ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఈ సమ్మర్ లోనే విడుదలకాబోతోంది.

అన్నట్టు ఈ సినిమాను కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేస్తున్నారు. తమిళ్ లో విడుదల చేయడం లేదు. నిజానికి తమిళనాట కూడా సమంతకు మంచి క్రేజ్ ఉంది. ఆమె సినిమాకు అక్కడ కూడా కచ్చితంగా వసూళ్లు వస్తాయి. కానీ మేకర్స్ మాత్రం కావాలనే తమిళ రిలీజ్ ఆపారు. ఎందుకంటే, ఓ బేబీ సినిమా తమిళ రీమేక్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు అమ్మే ఆలోచనలో ఉన్నాడట నిర్మాత సురేష్ బాబు.

ప్రస్తుతం మజిలీ సినిమా ప్రమోషన్ లో ఉంది సమంత. ఏప్రిల్ 5న ఆ సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఆ వెంటనే ఓ బేబీ సినిమా ప్రచారం స్టార్ట్ చేస్తుంది. ఆ వెంటనే శర్వానంద్ హీరోగా 96 రీమేక్ ను సెట్స్ పైకి తీసుకురాబోంది ఈ అక్కినేని కోడలు పిల్ల.