మరో తెలుగు సినిమాలో విజయ్ సేతుపతి

కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి. కేవలం హీరోగానే కాదు, క్యారెక్టర్ నచ్చితే విలన్, కమెడియన్.. ఇలా ఏ పాత్ర అయినా చేసేస్తాడు. రీసెంట్ గా పేట సినిమాలో నెగెటివ్ రోల్ లో కూడా కనిపించి మెప్పించాడు. ఇప్పుడీ హీరో తెలుగులో ఓ మూవీకి కాల్షీట్లు కేటాయించాడు. అది కూడా మెగా హీరో సినిమా.

అవును.. మెగా కాంపౌండ్ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతిని తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఇంకా పేరుపెట్టని ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నాడట.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోంది వైష్ణవ్ తేజ్ సినిమా. ఇందులో హీరో ఓ జాలరి. సినిమా మొత్తం ఓ పాయింట్ చుట్టూ తిరుగుతుందట. ఇంకా చెప్పాలంటే రంగస్థలం టైపులో ఓ కొత్త అనుభూతిని ఇస్తుందంటున్నారు.

ఇలాంటి సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఈ నటుడు, తెలుగులో చిరంజీవి చేస్తున్న సైరా సినిమాలో కూడా నటిస్తున్నాడు. అలా మెల్లమెల్లగా టాలీవుడ్ లో కూడా తన బేస్ పెంచుకుంటున్నాడు విజయ్ సేతుపతి.