24 గంటల్లో 15 లక్షల వీడియోలు తొలగించిన ఫేస్‌బుక్

సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ సహా ఇతర ప్లాట్‌ ఫామ్‌లపై ఈ మధ్య జాతి విద్వేషక పోస్టులు ఎక్కువయ్యాయి. దీంతో ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో పోస్టులు, కామెంట్లు పెట్టుకోవడమే కాక.. కొన్ని సమయాల్లో అవి అల్లర్లకు కారణం అవుతున్నాయి.

ఇటీవల న్యూజీలాండ్‌లోని రెండు మసీదులపై ఒక దుండగుడు జాతి విద్వేషంతో దాడి చేసిన నేపథ్యంలో అనేక మంది అతడికి మద్దతుగా పోస్టులు పెట్టారు. మసీదుల నరమేధం సృష్టించిన దుండగుడు తన చొక్కాకు ఫేస్‌బుక్ లైవ్ వీడియోను అనుసంధానం చేసి గో-ప్రో అనే కెమేరాను ధరించి ఆ ఘటనను లైవ్‌గా చూపించాడు.

అంతే కాకుండా అతను ఒక ప్రఖ్యాత యూట్యూబ్ ఛానల్‌కు దాన్ని ట్యాగ్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందికి వెంటనే లైవ్ రూపంలో వెళ్లిపోయింది. ఆ వీడియోను చూసిన చాలా మంది లైవ్ అనంతరం డౌన్‌లోడ్ చేసుకొని తిరిగి తమ ఖాతాలు, పేజీల ద్వారా అప్‌లోడ్ చేశారు.

ఈ వీడియోలు చూసిన అనేక మంది జాతి విద్వేష వ్యాఖ్యలు చేయడం… ఒక వర్గం ప్రజలను కించపరిచేలా పోస్టులు పెట్టడంతో ఫేస్‌బుక్ మేల్కొంది. ఇలాంటి 15 లక్షల వీడియోలను కేవలం 24 గంటల్లో తొలగించింది. అంతే కాకుండా ఆ తర్వాత అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నించిన 12 లక్షల మంది యూజర్లను అడ్డుకుంది.

మరోవైపు ఈ దురాగతానికి పాల్పడిన వ్యక్తికి సంబంధించిన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను సదరు సంస్థలు తొలగించాయి. కాగా, ఫేస్‌బుక్ ఈ ఘటనకు సంబంధించిన లైవ్‌ను అడ్డుకోనందుకు నిరసనగా ప్రఖ్యాత ఎయిర్ లైన్ సంస్థ ఎయిర్ ఏసియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్‌ తన ఖాతాను తొలగించుకున్నారు. ఆయనకు 6.70 లక్షల మంది ఫాలోయర్లు ఉండటం గమనార్హం.