Telugu Global
National

గోవాలో రాత్రంతా రాజకీయం.... సీఎం కుర్చీపై సిగపట్లు

బీజేపీ సీనియర్ నేత, గోవా సీఎం మనోహర్ పారికర్ మరణించి గంటలు కూడా గడవక ముందే గోవాలో రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎం పోస్టు నాకంటే నాకంటూ సిగపట్లు పడుతున్నారు. దీంతో పారికర్ మృతి వార్తతో గోవా చేరుకున్న నితిన్ గడ్కరి.. రాత్రంతా మిత్రపక్షాలతో సమావేశాలు నిర్వహించాల్సి వచ్చింది. 2017లో గోవా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. కాని నితిన్ గడ్కరి చాకచక్యంగా వ్యవహరించి అప్పట్లో రక్షణ మంత్రిగా ఉన్న పారికర్‌ను […]

గోవాలో రాత్రంతా రాజకీయం.... సీఎం కుర్చీపై సిగపట్లు
X

బీజేపీ సీనియర్ నేత, గోవా సీఎం మనోహర్ పారికర్ మరణించి గంటలు కూడా గడవక ముందే గోవాలో రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎం పోస్టు నాకంటే నాకంటూ సిగపట్లు పడుతున్నారు. దీంతో పారికర్ మృతి వార్తతో గోవా చేరుకున్న నితిన్ గడ్కరి.. రాత్రంతా మిత్రపక్షాలతో సమావేశాలు నిర్వహించాల్సి వచ్చింది.

2017లో గోవా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. కాని నితిన్ గడ్కరి చాకచక్యంగా వ్యవహరించి అప్పట్లో రక్షణ మంత్రిగా ఉన్న పారికర్‌ను సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించారు. దీంతో మహారాష్ట్రవాదీ గోమాంతక్ పార్టీ (ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ మరియు ఇండిపెండెంట్లు పారికర్ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. దీంతో మొత్తం 40 సీట్లకు గానూ 13 సీట్ల బలమున్న బీజేపీ అధికారం చేపట్టింది. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు పలికారు. కాని తర్వాత వారు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.

ఇక ప్రస్తుతం సీఎం పదవి తమకే ఇవ్వాలని ఎంజీపీ సభ్యుడు సుదిన్ ధావలికర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని గోవా బీజేపీ సీనియర్ నేత, ఉప సభాపతి మైఖేల్ లోబో ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే రాత్రంతా నితిన్ గడ్కరీ గోవా రాజకీయంపై సమావేశాలు నిర్వహించారు. బీజేపీ తమ పార్టీకి చెందిన వ్యక్తినే తర్వాతి సీఎంను చేయాలని పట్టుదలగా ఉంది. ఎంజీపీ డిమాండుకు ఒప్పుకునేది లేదని కూడా తేల్చి చెప్పింది.

మరోవైపు గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన విజయ్ సర్థేశాయ్ కూడా తనకు తాను సీఎం అభ్యర్థిత్వానికి సరైన వ్యక్తిని అని చెబుతున్నారు. మా పార్టీ మనోహర్ పారికర్‌కు మాత్రమే మద్దతు ఇచ్చిందని.. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి మద్దతు ఇవ్వమని స్పష్టం చేశారు. ప్రస్తుత స్పీకర్ ప్రమోద్ సావంత్‌ను తదుపరి సీఎంను చేయాలని బీజేపీ మిత్రపక్షాలను కోరుతోంది.

కాగా, గోవా అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ కూడా అధికారం చేపట్టడానికి పావులు కదుపుతోంది. ఈ మేరకు గోవా గవర్నర్ మృదులా సిన్హాకు లేఖ కూడా రాశారు. అధికార బదిలీ ఎలాంటి వివాదాలు లేకుండా చేయడానికి సహకరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం పదవి ఆశిస్తున్న దిగంబర్ కామత్ కూడా రాత్రి హుటాహుటిన ఢిల్లీ బయలు దేరారు. తమ పార్టీని గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేయించేలా అధిష్టానంతో చర్చలు జరపడానికే వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇలా ఒకవైపు దివంగత సీఎం పారికర్ అంత్యక్రియలు జరుగక మునుపే…. గోవా రాజకీయం రసవత్తరంగా మారడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

First Published:  17 March 2019 11:19 PM GMT
Next Story