Telugu Global
International

'టార్గెట్ పూర్తయ్యింది' అంటూ న్యూజిలాండ్ ఘటనపై పోస్టు.. టీనేజర్ అరెస్టు..!

సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే సమయంలో గాని, వివాదాస్పద విషయాల్లో స్పందనలు రాసేటప్పుడు గానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు మనసులో అనిపించింది రాసేసి చేతులు దులిపేసుకుంటే తర్వాత తీవ్రమైన ఇబ్బందుల్లో పడొచ్చు. ఇప్పుడు అలాంటి ఘటనే న్యూజీలాండ్ యువకుడి విషయంలో జరిగింది. న్యూజీలాండ్‌లోని క్రైస్ట్ చర్చి అల్‌నూర్, లిన్‌వుడ్ మసీదుల్లో ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ జరిపిన కాల్పుల్లో 50 మంది మరణించడంతో పాటు అనేక మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన ‘లైవ్ […]

టార్గెట్ పూర్తయ్యింది అంటూ న్యూజిలాండ్ ఘటనపై పోస్టు.. టీనేజర్ అరెస్టు..!
X

సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే సమయంలో గాని, వివాదాస్పద విషయాల్లో స్పందనలు రాసేటప్పుడు గానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు మనసులో అనిపించింది రాసేసి చేతులు దులిపేసుకుంటే తర్వాత తీవ్రమైన ఇబ్బందుల్లో పడొచ్చు. ఇప్పుడు అలాంటి ఘటనే న్యూజీలాండ్ యువకుడి విషయంలో జరిగింది.

న్యూజీలాండ్‌లోని క్రైస్ట్ చర్చి అల్‌నూర్, లిన్‌వుడ్ మసీదుల్లో ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ జరిపిన కాల్పుల్లో 50 మంది మరణించడంతో పాటు అనేక మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన ‘లైవ్ ఫీడ్’ సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు ఒక యువకుడు. అంతే కాకుండా ‘టార్గెట్ పూర్తయ్యింది’ అంటూ మరో పోస్టులో మసీదు ఫొటోను ఉంచాడు.

ఈ రెండు పోస్టులపై న్యూజీలాండ్ కోర్టులో అతనిపై కేసు నమోదు చేశారు. ఆ యువకుడు పేరు బయటకు వెళ్లడించక పోయినా.. హింసను ప్రేరేపించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు అతడిపై జడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో కేసులో 14 ఏండ్ల చొప్పున ఇతడికి శిక్ష వేసే అవకాశం ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది వెల్లడించారు.

ఈ యువకుడు చేసిన పనికి జడ్జి బెయిలు ఇవ్వడానికి కూడా నిరాకరించారు. వచ్చే నెల 8న తిరిగి తన ముందు ప్రవేశపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయవద్దని కూడా అధికారులను ఆదేశించారు.

కాగా, న్యూజిలాండ్ కాల్పులపై దర్యాప్తు చేస్తున్న అధికారులు ఈ యువకుడికి, నిందితుడైన ఆస్ట్రేలియన్‌కు మధ్య ప్రత్యక్ష సంబంధాలు లేవని తేల్చారు. కేవలం ప్రజలను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టినందుకే కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

First Published:  18 March 2019 1:24 AM GMT
Next Story