ఆర్ఎస్ఎస్ ను పక్కన పెడుతున్న మోడీ ద్వయం

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్… కొన్ని హిందూ సంస్థలు…. భారతీయ జనతా పార్టీకి మూల స్ధంభాలు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల వరకూ ఆర్ఎస్ఎస్ చెప్పిందే వేదంగా భావించేవారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా స్వయంగా సంఘ్ నుంచి వచ్చిన వారే కావడంతో వారి మాటలకు అత్యంత విలువ ఇచ్చేవారు. కాలక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పెద్దల మాటలను పెడచెవిన పెట్టడం… వారిని పట్టించుకోకపోవడం వంటివి ప్రారంభించారు.

ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ద్వయం రాష్ట్రీయ స్వయం సంఘ్ పేరు చెబితేనే మండిపడే స్థితికి ఇప్పుడు వచ్చారంటున్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అభ్యర్ధుల ఖరారుపై సంఘ్ పరివారాన్ని పక్కనపెట్టాలని సీరియస్ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ముందుగా తెలుగు రాష్ట్రాల నుంచే ప్రారంభించినట్లుగా చెబుతున్నారు.

ఆదివారం నాడు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభతో పాటు శాసనసభకు పోటీ చేసే అభ్యర్ధులను ఖరారు చేసింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. అయితే సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయకు ఈసారి మొండి చేయిచూపుతున్నట్లు సమాచారం.

ఈసారి సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ కాకుండా కిషన్ రెడ్దిని ఎన్నికల బరిలో నిలపాలని నిర్ణయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కూడా టిక్కట్ నిరాకరించారు. గత శాసనసభలో ఆయన తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేశారు. బండారు దత్తాత్రేయ, మాణిక్యాల రావు… ఇద్దరూ ఆర్ ఎస్ ఎస్ మనుషులు కావడం వల్లే వీరిద్దరికి టిక్కెట్లు నిరాకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సారి ఎన్నికల్లో సంఘ్ పరివార్ కు చెందిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీకి సంబంధించిన వారికే అవకాశాలు ఇవ్వాలని మోదీ, షా ద్వయం నిర్ణయించినట్లు చెబుతున్నారు.

ఇంతకు ముందే పార్టీ సీనియర్ నాయకులు అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారికి ఎసరు పెట్టిన ఈ ద్వయం రానున్న ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వారిని పూర్తి స్ధాయిలో పక్కన పెడతారని అంటున్నారు.