మావోలు అనుకుని ఇద్దరు గిరిజనుల కాల్చివేత

విశాఖపట్టణం జిల్లా పెదబయలు మండలంలోని పెదకోడపల్లి పంచాయతీ పరిధిలోని బూరదమ్మిడి గ్రామంలో గ్రేయ్ హౌండ్ పోలీసులు ఇద్దరు గిరిజనులను గత 15వ తేదీన అక్రమంగా కాల్చి చంపినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 52 ఏళ్ల భట్టి భూషన్, 30 ఏళ్ల సిడారి జమధార్ ఈ కాల్పుల్లో మరణించారు.

సి.ఆర్.పి.ఎఫ్. దళాలు, గ్రే హౌండ్స్ దళాలు కూంబింగ్ కార్యక్రమంలో ఉండగా పెదబయలు ఏరియా కమిటీ మావోయిస్టులు కాల్పులు చేశారనీ ఆ దళాన్ని ప్రతిఘటించడానికి చేసిన ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తులు మరణించారని గ్రే హౌండ్ పోలీసులు అంటున్నారు.

పెదకోడపల్లె శివారు గ్రామం మెట్టవీధికి చెందిన భూషణం, బొంజుబాబు, జమధార్, రాంబాబు 15వ తేదీ రాత్రి భోజనాలు ముగించుకుని అడవిలోకి పిట్టలను వేటాడడానికి బయలుదేరారు. గిరిజన ప్రాంతాలలో ఇది సర్వసాధారణం.

భూషణం, బొంజుబాబు తలకు టార్చ్ లైట్లు కట్టుకుంటే మిగతా ఇద్దరు టార్చి లైట్లు పట్టుకుని వెళ్లారు. బూరదమ్మిడి గ్రామ సమీపంలోని అర్నాం బయలు కొండ దిగుతుండగా అర ఫర్లాంగ్ దూరం నుంచి పోలీసులు కాల్పులు జరిపారు. రాం బాబు, బొంజుబాబు ఎలాగో కాల్పుల నుంచి తప్పించుకున్నారు. రాం బాబు కొంత దూరం పాకుతూ వెళ్లి మర్నాడు ఉదయం 8 గంటల దాకా చెట్టు మీదే దాక్కున్నాడు. బొంజుబాబు పరుగెత్తుకుంటూ మెట్టవీధికి వెళ్లి పోయాడు.

భూషణం, జమధార్ మాత్రం కాల్పులకు బలయ్యారు. భూషణం రైతు. ఆయనకు ముగ్గురు పిల్లలు. జమాధార్ కు ఇటీవలే పెళ్లి అయింది. ఈ సంఘటన జరిగిన కొద్ది సేపటికి ఎంకౌంటర్ల పాత కథను కొత్తగా వినిపించారు. మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మరణించారని చెప్పారు. సంఘటన జరిగిన బూరదమ్మిడి మరీ మారు మూల ప్రాంతం ఏమీ కాదు. పాడేరుకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కాల్పుల్లో మరణించిన గిరిజనులకు నష్టపరిహారం చెల్లించి ఈ మరణాలకు కారకులైన పోలీసుల మీద భారత శిక్షా స్మృతి 302 సెక్షన్ ప్రకారం హత్య కేసు నమోదు చేయాలని మానవ హక్కుల వేదిక సమన్వయకర్త వి.ఎస్. కృష్ణ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.