మరొక అగ్ర దర్శకుడితో ప్రభాస్?

టాలీవుడ్ లోని అగ్ర దర్శకుల లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. ‘అజ్ఞాతవాసి’ సినిమాతో డిజాస్టర్ అందుకున్నప్పటికీ…. ‘అరవింద సమేత’ తో మంచి హిట్ ను నమోదు చేసుకున్నారు మాటల మాంత్రికుడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమా కు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తరువాత బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మూడవ సినిమా ఇది.

ఈ సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్ మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ కు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నుంచి ఒక పెద్ద ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ వారి వద్ద ప్రభాస్ డేట్లు ఉన్నాయట…. వారు త్రివిక్రమ్ ను సంప్రదించి ప్రభాస్ కోసం ఒక మంచి కథను తయారు చేయమని చెప్పారట.

ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ప్రభాస్ కోసం ఒక మంచి కథ తయారు చేసే పనిలో పడ్డారట. ఇప్పటిదాకా త్రివిక్రమ్-ప్రభాస్ కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. ఒకవేళ ఇది గనక కుదిరితే…. ఒక క్రేజీ కాంబో అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మరి ఈ మాటల మాంత్రికుడు యంగ్ రెబల్ స్టార్ కోసం ఎలాంటి కథ సిద్ధం చేస్తాడు? ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కనుంది? అనే విషయాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.