అసదుద్దీన్‌ ఓవైసీ స్థానంలో అక్బరుద్దీన్?

తెలంగాణలో ఉన్న 17 సీట్లలో 16 మనం గెలవాలి… మిగిలిన హైదరాబాద్ సీటు మిత్రుడైన అసదుద్ధీన్ ఓవైసీని గెలిపించాలని కేసీఆర్ పదే పదే చెబుతూనే ఉన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ కూడా తన సిట్టింగ్ స్థానమైన హైదరాబాద్‌ కోసం సోమవారమే నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇంతలోనే ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.

అసదుద్ధీన్ సోదరుడు, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ బుధవారం నాడు హైదరాబాద్ పార్లమెంటుకు నామినేషన్ దాఖలు చేశారు. అటు పార్టీ కార్యకర్తలకు గానీ.. మీడియాకు గానీ సమాచారం ఇవ్వకుండా హఠాత్తుగా తన నామినేషన్ దాఖలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. దీంతో అసలు మజ్లిస్ పార్టీలో ఏం జరుగుతుందనే అనుమానాలు మొదలయ్యాయి.

అక్బరుద్దీన్ నామినేషన్ విషయం తెలుసుకొని ఎంఐఎం కార్యకర్తలు పార్టీ పెద్దలను ఆరా తీశారు. అసలు రెండో నామినేషన్ వేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ నిలదీశారు. అయితే అసలైన అభ్యర్థితో పాటు పార్టీ నుంచి ఎవరో ఒకరు డమ్మీ అభ్యర్ధిగా నామినేషన్ వేయడం సాధారణమేనని ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదంటూ సర్థి చెప్పినా కార్యకర్తలు మాత్రం వారి జవాబుతో సంతృప్తి చెందడం లేదు.

మరోవైపు అక్బరుద్దీన్ నామినేషన్‌పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అసదుద్దీన్ ఈ సారి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఔరంగాబాద్‌లో ఎంఐఎం పార్టీకి గట్టి పట్టు ఉంది. అంతే కాకుండా ప్రకాశ్ అంబేత్కర్‌కు చెందిన భరీపా బహుజన్ మహాసంఘ్ పార్టీతో పొత్తు కూడా ఉంది. దీంతో అక్కడ నుంచి అసదుద్దీన్ పోటీ చేస్తే తప్పక గెలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

అక్బరుద్ధీన్ హైదరాబాద్ నుంచి పోటీ చేసి తాను ఔరంగాబాద్‌కు మారాలని ఎంఐఎం అధినేత అనుకుంటున్నారట. అయితే పార్టీ కార్యకర్తలకు మాత్రం ఇంత వరకు ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేకపోవడం వల్ల పార్టీలో అలజడి రేగిందని సమాచారం. మరి అసదుద్ధీన్ ప్రతిపాదనకు పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.