Telugu Global
Cinema & Entertainment

డిజిటల్ స్ట్రీమింగ్ పై కొత్త నిబంధనలు

అమెజాన్ ప్రైమ్ వీడియోస్ రాకతో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే ప్రేక్షకులు మరింతగా తగ్గిపోయారు. ఏదైనా సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో వస్తుందని తెలిస్తే చాలు, ఇక ఆ సినిమాను థియేటర్లలో చూడడం మానేస్తున్నారు. నెల రోజులాగితే ఎలాగూ వస్తుంది కదా, ఎంచక్కా ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చనే ధీమా వచ్చేసింది ప్రేక్షకులకి. థియేటర్ కు వెళ్తే వెయ్యి రూపాయలు ఖర్చు. అదే అమెజాన్ ప్రైమ్ పెట్టుకుంటే నెలకు 110 రూపాయలతో పనైపోతుంది. కుటుంబం మొత్తం హ్యాపీగా […]

డిజిటల్ స్ట్రీమింగ్ పై కొత్త నిబంధనలు
X

అమెజాన్ ప్రైమ్ వీడియోస్ రాకతో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే ప్రేక్షకులు మరింతగా తగ్గిపోయారు. ఏదైనా సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో వస్తుందని తెలిస్తే చాలు, ఇక ఆ సినిమాను థియేటర్లలో చూడడం మానేస్తున్నారు. నెల రోజులాగితే ఎలాగూ వస్తుంది కదా, ఎంచక్కా ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చనే ధీమా వచ్చేసింది ప్రేక్షకులకి. థియేటర్ కు వెళ్తే వెయ్యి రూపాయలు ఖర్చు. అదే అమెజాన్ ప్రైమ్ పెట్టుకుంటే నెలకు 110 రూపాయలతో పనైపోతుంది. కుటుంబం మొత్తం హ్యాపీగా ఇంట్లో కూర్చొని సినిమా చూడొచ్చు. ఇలా దాదాపు ప్రతి ఇంటికి, ప్రతి మొబైల్ కు చేరిపోయిన డిజిటల్ స్ట్రీమింగ్ పై నిబంధనలు విధించింది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.

ఇకపై విడుదలైన వెంటనే నెల రోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్ లో సినిమా చూడడం కుదరదు. అమెజాన్ పెడుతున్నట్టు 4 వారాల కండిషన్ కు ఇకపై నిర్మాతలు ఒప్పుకోరు. థియేటర్లలో సినిమా విడుదలైన 8 వారాల్లోపు డిజిటల్ స్ట్రీమింగ్ కు పెట్టడానికి వీల్లేదంటూ సరికొత్త నిబంధన తీసుకొచ్చింది నిర్మాతల మండలి. ఇకపై చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఈ నిబంధన పాటించాల్సిందే. అలా పాటించకపోతే సదరు నిర్మాతపై చర్యలు తప్పవు.

తెలుగు సినిమాను కాపాడుకునేందుకు, థియేటర్లను నిలబెట్టేందుకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. సో.. ఇకపై అమెజాన్ ప్రైమ్, జీ5, జియో మూవీస్, ఐడియా మూవీస్, హాట్ స్టార్ ఇలా ఏ మాధ్యమంలో సినిమా చూడాలన్నా 2 నెలలు ఆగాల్సిందే.

అయితే ఈ నిర్ణయంపై చిన్న నిర్మాతలు మాత్రం మండిపడుతున్నారు. ఓవైపు థియేటర్లను బ్లాక్ చేసి, మరోవైపు డిజిటల్ స్ట్రీమింగ్ పై కూడా ఇలాంటి నిబంధనలు పెడితే అమెజాన్ ప్రైమ్ లాంటి సంస్థలు చిన్న సినిమాలు కొనవని, అటు డిజిటల్ స్ట్రీమింగ్ లో సినిమాలు చూసే వీక్షకులకు కూడా ఆసక్తి తగ్గిపోతుందని వాదిస్తున్నారు.

అయినా చిన్న సినిమా నిర్మాతల్ని సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం తగదంటున్నారు. దీనిపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

నిజానికి ఈ వివాదం ఇప్పటిది కాదు. గతంలో డీఎస్పీ (డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు)లతో గొడవలు జరిగినప్పుడే ఈ వివాదం కూడా తెరపైకి వచ్చింది. డిజిటల్ స్ట్రీమింగ్ ను కట్టడి చేయాలంటూ కొందరు నిర్మాతలు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు.

కానీ అప్పట్లో దీని కంటే డీఎస్పీల వివాదం పెద్దది కాబట్టి దానిపై దృష్టిపెట్టారు. ఇన్నాళ్లకు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ పై కూడా నిబంధనలు అమలు చేశారు. మరి దీనికి డిజిటల్ స్ట్రీమింగ్ ప్రొవైడర్లు ఎలా స్పందిస్తాయో చూడాలి. 2 నెలల తర్వాత స్ట్రీమింగ్ కు అవి ఒప్పుకోకపోవచ్చు.

First Published:  20 March 2019 9:40 PM GMT
Next Story