Telugu Global
NEWS

ముగ్గురు నేతలకు... మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న బాబు...!

ఆ ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన వారు. లోక్ సభ సభ్యులు గా, మంత్రులుగా, మేయర్ గా పదవులు పొందిన వారు. ఇక వంద ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా కూడా అనేక పదవులు పొందిన నాయకులు. సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతున్న దశలో కూడా తమకంటూ సొంత క్యాడర్ నిలుపుకున్న సీనియర్ నాయకులు. వారిలో ఇద్దరు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కొణతాల రామకృష్ణ,  […]

ముగ్గురు నేతలకు... మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న బాబు...!
X

ఆ ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన వారు. లోక్ సభ సభ్యులు గా, మంత్రులుగా, మేయర్ గా పదవులు పొందిన వారు. ఇక వంద ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా కూడా అనేక పదవులు పొందిన నాయకులు. సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతున్న దశలో కూడా తమకంటూ సొంత క్యాడర్ నిలుపుకున్న సీనియర్ నాయకులు. వారిలో ఇద్దరు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కొణతాల రామకృష్ణ, సబ్బం హరి. ఇక ముచ్చటగా మూడో నాయకుడు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి రెండుసార్లు లోక్ సభకు ఎన్నికైన దళిత నాయకుడు హర్ష కుమార్.

ఈ ముగ్గురికీ వారివారి జిల్లాలలో కార్యకర్తల బలంతో పాటు ప్రజల ఆదరణ కూడా ఉంది. ఇదిగో ఇప్పుడే.. రాజకీయాలలో టక్కుటమార విద్యలు నేర్చుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పన్నిన వ్యూహంలో చిక్కుకుని గిలగిల్లాడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలిసి లోక్ సభకు పోటీ చేయాలని ఈ ముగ్గురు నాయకులు కలలు కన్నారు.

వీరిలో హర్ష కుమార్… చంద్రబాబు నాయుడు ని కలిసారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పాదాభివందనం కూడా చేశారు. అయితే ఆయన ఆశిస్తున్న అమలాపురం లోక్ సభకు మాత్రం టిక్కెట్టు తెచ్చుకోలేకపోయారు. దీంతో కార్యకర్తలకు ఏం చెప్పాలో తెలియక రెండు రోజుల్లోనే పార్టీ మారడం చేతకాక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అభిమానులు చెబుతున్నారు.

విశాఖ మేయర్ గా, లోక్ సభ సభ్యుడిగాను పని చేసిన సబ్బం హరి గడచిన ఏడాదిగా చంద్రబాబును భుజాల మీద కు ఎత్తుతున్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని, గొప్ప ముందుచూపు ఉన్నవాడని పదే పదే పొగుడుతున్నారు. ఈ ఎన్నికలలో విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని చంద్రబాబును కోరారు.

ముందు పార్టీలో చేరాలని, తర్వాత టిక్కెట్ అంటూ ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత తీరిగ్గా సబ్బం హరికి భీమిలి శాసనసభ నియోజక వర్గాన్ని కేటాయించారు. ఈ స్థానంలో ఎవరు పోటీ చేసినా ఓడిపోతారని చంద్రబాబునాయుడికి తెలుసు కాబట్టే తనకు కేటాయించారని సబ్బం హరి కినుక వహించారు.

చివరిగా మిగిలిన నాయకుడు కొణతాల రామకృష్ణ. ముందుగా చంద్రబాబు నాయుడును కలిసి అనకాపల్లి లోక్ సభ స్థానాన్ని అడిగారు. వారం రోజులు తిప్పుకున్న చంద్రబాబు నాయుడు మీకు ఆ టిక్కెట్ కేటాయించలేమని చేతులు ఎత్తేసారు. దీంతో అలిగిన కొణతాల రామకృష్ణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ను కలిశారు. తనను కలిసిన తొలిరోజునే టిక్కెట్ పైన హామీ ఇవ్వలేమని అంటూ జగన్ స్పష్టం చేశారు. దీంతో మళ్లీ చంద్రబాబును కలిశారు కొణతాల రామకృష్ణ.

నామినేషన్లకు గడువు ముగుస్తున్నా ఇప్పటి వరకు ఈ ముగ్గురు నాయకులను తన చుట్టూ తిప్పు కుంటున్న చంద్రబాబు నాయుడు వారికి కావలసిన స్థానాలు మాత్రం కేటాయించలేదు.

గతంలో ఓ వెలుగు వెలిగిన ఈ ముగ్గురు నాయకులని చంద్రబాబు నాయుడు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కూడా చెబుతున్నారు.

First Published:  20 March 2019 8:58 PM GMT
Next Story