Telugu Global
NEWS

కమలనాథుల ఆపరేషన్ ఆకర్ష్ !

తెలుగు రాష్ట్రాల్లో తమ పట్టు నిలుపుకోవడానికి భారతీయ జనతా పార్టీ నానా తంటాలు పడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ వారిని తమ వైపు తిప్పుకోవాలని ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ వైపు చూసేలా వ్యూహరచన చేస్తోంది. దీంతో తెలంగాణలో పార్టీ టిక్కెట్లు ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను బిజెపి వైపు ఆకర్షించడానికి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు […]

కమలనాథుల ఆపరేషన్ ఆకర్ష్ !
X

తెలుగు రాష్ట్రాల్లో తమ పట్టు నిలుపుకోవడానికి భారతీయ జనతా పార్టీ నానా తంటాలు పడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ వారిని తమ వైపు తిప్పుకోవాలని ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది బీజేపీ.

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ వైపు చూసేలా వ్యూహరచన చేస్తోంది. దీంతో తెలంగాణలో పార్టీ టిక్కెట్లు ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను బిజెపి వైపు ఆకర్షించడానికి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నాయకురాలు డీకే అరుణని భారతీయ జనతా పార్టీలో చేర్చుకున్నారు. మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి డీ.కే.అరుణ చేత పోటీ చేయిస్తామని భారతీయ జనతా పార్టీ అధిష్టానం వెల్లడించింది. ఇప్పుడు అదే దారిలో మరి కొంతమంది సీనియర్ నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆ తగాదాలు లోక్ సభకు అభ్యర్థుల ఎంపిక సందర్భంగా రోడ్డున పడుతున్నాయి. శాసనసభ ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి పోవడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతోంది.

దీంతో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అయిన రేణుకా చౌదరి, సర్వే సత్యనారాయణ, సునీతా లక్ష్మారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి వంటి వారిని బిజెపిలో చేర్చుకునేందుకు ఆ పార్టీ అధిష్టానం దూతలను పంపినట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఖమ్మం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ రేణుకా చౌదరి బిజెపిలో చేరడం దాదాపు ఖరారైందని అంటున్నారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా శుక్రవారం కానీ, శనివారం కానీ భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు. ఆమెను మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించే యోచనలో ఉంది బీజేపీ అధిష్టానం.

ఇక ఖమ్మం నుంచి గడిచిన లోక్ సభ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. జిల్లాలో మంచి పట్టు ఉందని పేరున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి టిఆర్ఎస్ నుంచి ఈసారి ఖమ్మం టికెట్ రావడం లేదు. ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టీఆర్ఎస్ పలువురు నాయకులను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా భారతీయ జనతా పార్టీలో చేరి ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

First Published:  20 March 2019 11:24 PM GMT
Next Story