Telugu Global
NEWS

సముహూర్తం శుక్రవారం నాడే.... చాలామంది నామినేషన్లు....

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలు కూడా తమ తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ, లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. అధికార తెలుగుదేశం పార్టీ కూడా చాలా వరకు అభ్యర్ధులను ప్రకటించింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు చాలా మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలో సై […]

సముహూర్తం శుక్రవారం నాడే.... చాలామంది నామినేషన్లు....
X

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలు కూడా తమ తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ, లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. అధికార తెలుగుదేశం పార్టీ కూడా చాలా వరకు అభ్యర్ధులను ప్రకటించింది.

జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు చాలా మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలో సై అంటున్నాయి. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో మాత్రం అధికార తెలంగాణ రాష్ట్ర సమితి గురువారంనాడు తన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కూడా ఇదే రోజు తమ అభ్యర్థులను ప్రకటిస్తాయి అంటున్నారు.

నామినేషన్లు వేసేందుకు నాలుగురోజులు గడువు ఉంది. రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ముహూర్త బలం కోసం జ్యోతిష్యుల వెంట పడుతున్నారు. ఈనెల 22వ తేదీ శుక్రవారం నాడు దాదాపు అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులకు కలిసొచ్చే ముహూర్తమని జ్యోతిష్యులు వెల్లడిస్తున్నారు.

శుక్రవారం 22వ తేదీ ఫాల్గుణ మాసం… కృష్ణ పక్షం. విదియ తిధి. ఆ రోజు హస్త నక్షత్రం. ఈ రోజు దాదాపు అందరికీ కలిసివచ్చే రోజని జ్యోతిష్యులు లెక్కలు వేస్తున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల మూడు నిమిషాల నుంచి 11 గంటల 3 నిమిషాల వరకు మేష లగ్నం ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటా 15 నిమిషాల వరకు వృషభ లగ్నం ఉంది. సాయంత్రం వరకు మిథున లగ్నం ఉన్నట్లుగా జ్యోతిష్యులు చెబుతున్నారు.

శుక్రవారం మధ్యాహ్నం 11 గంటల 30 నిమిషాల నుంచి అరగంట పాటు అంటే 12 గంటల వరకు రాహుకాలం ఉంది. ఆ తర్వాత మూడు గంటల నుంచి 4 గంటల మధ్యలో… 30 నిమిషాల పాటు యమగండం ఉంది అంటున్నారు. ఈ రెండు సమయాలను మినహాయించి మిగిలిన రోజంతా నామినేషన్లు వేసేందుకు మంచి ముహూర్తం అని జ్యోతిష్య వేత్తలు చెబుతున్నారు.

ముహూర్త బలంతో పాటు మధ్యలో ఒక రోజు సెలవు కూడా రావడంతో నామినేషన్లు వేసేందుకు ఇంకా రెండు రోజులే గడువుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు శుక్రవారం నాడు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా అదే రోజు నామినేషన్ వేసే అవకాశం ఉందని ఆ పార్టీ ప్రకటించింది.

వాళ్ళతో పాటు పార్టీలోని సీనియర్ నాయకులు కూడా అదే రోజు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా ముహూర్త బలం చూసుకునే నాయకులు ఎక్కువ మంది ఉండడంతో వారు కూడా శుక్రవారం నాడే నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉందంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం నాడు నామినేషన్ ల పండగ జరగనుందని చెబుతున్నారు.

First Published:  20 March 2019 11:19 PM GMT
Next Story