చంద్ర దండుకు జనసైన్యం తాకట్టు…

2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి పవన్‌ కల్యాణ్‌ కూడా ఒక కారణం. అయితే చంద్రబాబు పాలనలో ఆయన చేసిన విన్యాసాలు చూసిన తర్వాత కాపులు కూడా చంద్రబాబుకు ఎందుకు ఓటేశామా అని బాధపడ్డారు. ముద్రగడ పద్మనాభం ఇంట్లోకి దూరి, ఆయన్ను, ఆయన భార్యను, కోడలిని బండబూతులు తిడుతూ ఈడ్చుకెళ్లిన వైనంతో కాపులోకం కంపించింది.

ఇంతలో పవన్‌ కల్యాణ్ కూడా చంద్రబాబుకు గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చి తప్పు చేశా అని గుంటూరు సభలో అప్పట్లో చెప్పడంతో జనసైనికులు ఊపిరిపీల్చుకున్నారు. తమ జనసేనాని ఇక చంద్రబాబుపై యుద్ధం చేస్తారని ఆశించారు. 2019 ఎన్నికల్లో సత్తా చాటుతామని చెప్పారు. పవన్‌ నిజాయితీగా రాజకీయం చేస్తారని భావించిన జనసైనికులకు ఇప్పుడు తీరా ఎన్నికల సమయంలో పవన్‌ కల్యాణ్ చేస్తున్న విన్యాసాలు విస్తుగొలుపుతున్నాయి.

ఎన్ని చెప్పినా పవన్‌ కల్యాన్ మనసు చంద్రబాబు వైపే లాగుతోంది. జనసేన నేరుగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూసేందుకు తపన పడుతున్న పవన్‌ కల్యాణ్ అందుకు తగ్గట్టే పావులు కదుపుతున్నారు. ఇందుకోసమే విచిత్రంగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అధికారంలోకి రాని ప్రతిపక్ష పార్టీపై విమర్శలు, తీవ్రవ్యాఖ్యలు చేస్తున్నారు గానీ… చంద్రబాబును మాత్రం సుతిమెత్తగా రెండు మాటలు అనేసి వదిలేస్తున్నారు పవన్‌.

పైగా ఏపీలో ఉనికి లేని మాయావతి పార్టీకి 21 సీట్లు పవన్ కల్యాణ్ కేటాయించారంటేనే దాని వెనుక చంద్రబాబు వ్యూహం ఉందన్నది సుసృష్టం. గాజువాకలో ఆయన ప్రసంగం తర్వాత జనసైనికులకు ఒక క్లారిటీ వచ్చే ఉండాలి. 

జనం ఏమనుకుంటే నాకేం… రాష్ట్రం ఎటుపోతే నాకేం… జస్ట్‌ చంద్రబాబు బాగుంటే చాలు అన్న భావన పవన్‌ ప్రసంగంలో స్పష్టంగా అర్థమవుతోంది. సో.. ఈ సారి పరోక్షంగా చంద్రబాబుకు జనసైనికులను పవన్‌ కల్యాణ్ తాకట్టు పెడుతున్నారన్నది అనుమానం అక్కర్లేని అంశం. నచ్చనివాళ్లు బుకాయించవచ్చు. కానీ ఇప్పుడు జనసైనికులకు ముందు రెండే దారులు. సేనాని చెప్పారని చంద్రబాబు గెలుపుకు ఎంపిక చేసిన నియోజక వర్గాల్లో సాయపడడం. లేదంటే రాష్ట్రం కోసం ఆలోచించి సొంతంగా నిర్ణయం తీసుకోవడం.