ఏపీకి రాహుల్ రారు: బాబు కోసమేనా?

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి నానాటికీ రాజుకుంటోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ, విపక్షాలైన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలు…. సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఉలుకూ.. పలుకూ లేకుండా స్తబ్దుగా ఉంది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో కూడా వెనుకబడి ఉంది. ” మేం పోటీ చేస్తాం.. మేం పోటీ చేస్తామంటూ” వేలల్లో దరఖాస్తులు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నా వాస్తవానికి పోటీ చేసే వారు మాత్రం కనిపించడం లేదంటున్నారు. ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సభలు, సమావేశాల జోలికి వెళ్లటం లేదంటున్నారు.

ఎన్నికల తేదీ ప్రకటించిన రోజున, ఆ తర్వాత జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ లో కనీసం 15 బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొంటారని ప్రకటించారు. ఇది జరిగి దాదాపు నెల కావస్తోంది. రాహుల్ గాంధీ ఏ సభలో పాల్గొంటారో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శాఖ ప్రకటించడం లేదు.

తాజాగా అందిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఏ సభలోనూ రాహుల్ గాంధీ పాల్గొనలేరు. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో జరిగిన రహస్య ఒప్పందమే అంటున్నారు. రాహుల్ గాంధీ పాల్గొనే సభల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు, ఆయన ప్రతినిధులను ఘాటుగా విమర్శించాల్సి ఉంటుంది.

అలా చేయడం వల్ల తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం వస్తుందని, ఎన్నికల అనంతరం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకే తాను మద్దతు తెలుపుతాను కాబట్టి సభలకు రావద్దని చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీని కోరినట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ ఒప్పందం కారణంగా ఏఐసీసీ అధ్యక్షుడు  రాహుల్  గాంధీ ఆంధ్రప్రదేశ్ లో  పర్యటించడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలాగో ఒక స్థానం  కూడా గెలవలేమని  తేలిపోవడంతో తెలంగాణ పైనే దృష్టి సారించాలని, దాని వల్ల అక్కడ కనీసం ఏడు లేదా ఎనిమిది స్థానాలు గెలుస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి సూచించినట్లుగా చెబుతున్నారు. ఈ కారణాలతోనే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించే అవకాశాలు లేవంటున్నారు.