Telugu Global
NEWS

ఎన్నికల తర్వాత భారీ కుదుపు: కారు కార్యాలయంలో చర్చలు

“లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలో భారీ మార్పులు ఉంటాయా? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అలాగే అనిపిస్తోంది” తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నిజామాబాద్ జిల్లా సీనియర్ నాయకుడి వ్యాఖ్య. “రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో వచ్చే మార్పులు పార్టీకి అనుకూలమా? వ్యతిరేకమా? అన్నది పక్కన బెడితే భారీ కుదుపులు మాత్రం ఖాయం” అనేది తెలంగాణ రాష్ట్ర సమితి ఖమ్మం జిల్లా సీనియర్ నేత అభిప్రాయం. తెలంగాణ రాష్ట్ర సమితి లోక్ సభ […]

ఎన్నికల తర్వాత భారీ కుదుపు: కారు కార్యాలయంలో చర్చలు
X

“లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలో భారీ మార్పులు ఉంటాయా? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అలాగే అనిపిస్తోంది” తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నిజామాబాద్ జిల్లా సీనియర్ నాయకుడి వ్యాఖ్య.

“రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో వచ్చే మార్పులు పార్టీకి అనుకూలమా? వ్యతిరేకమా? అన్నది పక్కన బెడితే భారీ కుదుపులు మాత్రం ఖాయం” అనేది తెలంగాణ రాష్ట్ర సమితి ఖమ్మం జిల్లా సీనియర్ నేత అభిప్రాయం.

తెలంగాణ రాష్ట్ర సమితి లోక్ సభ అభ్యర్థుల ప్రకటనకు వారం రోజుల ముందు… అభ్యర్థుల ప్రకటన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయంలో ఇలాంటి చర్చలు వినిపిస్తున్నాయి. ఎన్నికల అనంతరం పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ భారీ మార్పులు ఉంటాయని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. ఈ మార్పులకు ఎవరు బలవుతారు..!? ఎవరు లాభపడతారు..!? ఎవరు ఉన్నత స్థాయిలోకి వెళ్తారు!? ఎవరు అథమస్థాయికి వెళ్తారో చెప్పడం కష్టం అని అంటున్నారు.

లోక్ సభ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో తాను కీలకమైన పాత్ర పోషిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రకటించారు. అలాగే ఆయన కుమార్తె, నిజామాబాద్ లోక్ సభ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కూడా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “తెలంగాణ వారు ప్రధాని కాకూడదా” అంటూ ప్రశ్నించారు. ఈ పరిణామాలను చూస్తే కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వెళ్తారని పార్టీలో చర్చ జరుగుతోంది.

అదే జరిగితే తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావును ముఖ్యమంత్రిగా చేస్తారని, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఒకవైపు, సమర్థించేవాళ్ళు మరోవైపుకు వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితిలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు ను పక్కన పెట్టడం పార్టీలో చాలా మందికి రుచించడం లేదు.

అలాగే లోక్ సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా పార్టీలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇవన్నీ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎలాంటి మార్పులైనా తీసుకు రావచ్చని పార్టీ సీనియర్ నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాల కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ వీటిని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

భారత రాజకీయాలలో ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరూ నిర్ణయించలేరని, జరుగబోయే పరిణామాలను కూడా ఎవరూ ఊహించలేరని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

First Published:  22 March 2019 11:51 PM GMT
Next Story