బాబుకు ఓటమి తప్పదు…. పవన్ సంగతి చూడండి : పార్టీ శ్రేణులతో కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలు కాక తప్పదని, ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదని, ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీ శ్రేణులకు చెప్పారు.

తనకు అందిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో మెజారిటీ వస్తుందని, ఈ విషయం చంద్రబాబునాయుడుకు కూడా తెలుసు కాబట్టే…. తన పైనా, తెలంగాణ రాష్ట్ర సమితి పైనా విమర్శలు చేస్తున్నారని పార్టీ నాయకులతో కేసీఆర్ అన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకీ తెలుగుదేశం పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని, దాని నుంచి బయటపడేందుకు కేసీఆర్ ను బూచిలా చూపించాలని అనుకుంటున్నారని పార్టీ శ్రేణులతో వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.

గడచిన ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో తామేం అభివృద్ధి చేశాడు చెప్పడం కంటే కూడా తనపై రాళ్లు రువ్వడానికే చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీ వర్గాలతో అన్నట్లు చెబుతున్నారు. గడచిన నాలుగు రోజులుగా ఇది కూడా ఎలాంటి ఫలితం ఇవ్వటం లేదని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు తాజాగా పవన్ కళ్యాణ్ ను తనపై ఉసిగొల్పుతున్నాడని కెసిఆర్ అన్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు ఓటమి ఎలాగూ తప్పదు కాబట్టి ఎటువంటి విరోధం లేకపోయినా విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ను కట్టడి చేసేందుకు పార్టీ వర్గాలు ప్రతి విమర్శలు చేయాలని సూచించినట్లు సమాచారం.

గతంలో పవన్ కళ్యాణ్ తను కలిసి అభినందించిన పేపర్ క్లిప్పింగులను, వీడియోలను సాక్ష్యాలుగా చూపిస్తూ పవన్ కళ్యాణ్ పై విమర్శలను ఉద్ధృతం చేయాలని కెసిఆర్ సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్ కే రావాల్సి ఉంటుందని, ఆయనకు ఇక్కడి ప్రభుత్వంతోనే అవసరాలు ఉంటాయి అనే విషయాన్ని గుర్తు చేయాలని అన్నట్లు చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ వైఖరిపై సొంత పరిశ్రమకు చెందిన సినీ వర్గాల వారే మండిపడుతున్నారు అని, తమ పాలనను చూసిన సెటిలర్లు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పవన్ కళ్యాణ్ చేసే విమర్శలను తిప్పికొట్టాలని, దీంతో చంద్రబాబుకు కూడా గుణపాఠం చెప్పినట్టుగా అవుతుందని కెసిఆర్ తన అత్యంత సన్నిహిత వర్గాల వద్ద అన్నట్లు సమాచారం.