చివరకు టీడీపీ ఇంతగా దిగజారిందా..?

రాజకీయాలు అన్నాక ప్రత్యర్థుల ఎత్తుగడలను తిప్పికొట్టడం… వారి కంటే పైచేయి సాధించాలని అనుకోవడం సాధారణమే. ఇక ఎన్నికల సమయంలో అయితే ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటూ తమను తాము హైలైట్ చేసుకుంటారు.

అయితే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే సామాన్య ప్రజలు కూడా చీదరించుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్ష వైసీపీని అడ్డుకోవడానికి అధికార టీడీపీ చేతిలో ఉన్న అస్త్రాలన్నింటినీ వదులుతోంది.

తాజాగా ఎన్నికల ప్రచారం నిమిత్తం కృష్ణా జిల్లాలోని తిరువూరుకు వైసీపీ అధినేత జగన్ వెళ్లారు. ఇవాళ ఆయన ఆ వూర్లో ప్రసంగిస్తున్న సమయంలోనే కేబుల్ ప్రసారాలను నిలిపి వేశారు. జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణను తగ్గించడానికే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు టీడీపీ దిగిందని పలువురు ఆరోపిస్తున్నారు.

కాగా, కేబుల్ ప్రసారాలు ఎందుకు ఆపేశారని చాలా మంది ఆపరేటర్లకు ఫోన్ చేయగా నెట్‌వర్క్ సమస్య ఉందని.. అందుకే ఆపేయాల్సి వచ్చిందని సమాధానం చెప్పి చేతులు దులుపుకున్నారు. దాదాపు జగన్ ఉన్నంత సేపు తిరువూరులో కేబుల్ టీవీలు పని చేయలేదు.

కేవలం జగన్ పర్యటన ఉందనే కేబుల్ టీవీ ప్రసారాలు ఆపేశారని వైసీపీ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు.