చంద్రబాబులో చేగువేరా కనిపించాడా పవన్‌?

చంద్రబాబు చరిత్ర చెత్త బుట్టలో పడబోతున్నారని వైసీపీ నేత సి. రామచంద్రయ్య జోస్యం చెప్పారు. చంద్రబాబులో చెగువేరాను చూసిన వ్యక్తి పవన్‌ కల్యాణ్ అని ఎద్దేవా చేశారు. పవన్‌ కల్యాణ్ గొప్ప ఆదర్శభావాలు ఉన్న వ్యక్తి అని భావించామని… కానీ చంద్రబాబులో చెగువేరాను చూసేంత గొప్పవాడని ఊహించలేదన్నారు.

చంద్రబాబు పంపే స్క్రిప్ట్‌ను పక్కాగా పవన్‌ ఫాలో అవుతున్నారన్నారు. పవన్ కల్యాణ్ మరీ ఇంత దిగజారిపోతారని ఊహించలేదన్నారు. చంద్రబాబును మించి వెన్నుపోటుదారుడిగా పవన్‌ మారిపోయారన్నారు. లక్షల మంది అభిమానులను పవన్ వెన్నుపోటు పొడిచారన్నారు. అనంతపురం దత్తతు తీసుకుంటా, పార్టీ ఆఫీస్ పెడుతా, పోటీ చేస్తా అన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు ఆ పని చేయలేదన్నారు.

విదేశాల్లో రాయలసీమ వాళ్లు డబ్బులు వసూలు చేసి పవన్‌ కల్యాణ్‌కు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ పవన్‌ మాత్రం రాయలసీమను కించపరుస్తూ తప్పుడు దారిలో పయణిస్తున్నారన్నారు. పవన్‌ మరీ ఇంత డమ్మీ అయిపోతారనుకోలేదన్నారు. ప్యాకేజీ పాలిటిక్స్ చేయాలనుకుంటే పార్టీ ఎందుకని ప్రశ్నించారు. కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండదని చెప్పిన పవన్ కల్యాణ్…ఇప్పుడు తన అన్న నాగబాబుకు ఎలా టికెట్ ఇచ్చారని నిలదీశారు.

పవన్ కల్యాణ్‌కు చేతనైతే పొత్తులు కుదరని అన్ని స్థానాల్లో పవన్ పోటీ చేయాలని సి. రామచంద్రయ్య సూచించారు. చంద్రబాబు రాక్షస పాలన పోవాలని రాష్ట్రం మొత్తం కోరుకుంటుంటే పవన్ కల్యాణ్ మాత్రం తిరిగి చంద్రబాబును గెలిపించేందుకు కృషి చేస్తున్నారని రామచంద్రయ్య విమర్శించారు.