హరీష్ ను వదిలించుకోవాలి అనుకుంటున్న కేసీఆర్!

తన్నీరు హరీష్ రావు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉరకలెత్తిన ఉత్సాహంతో పాల్గొన్న నాయకులు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త శాసనసభకు జరిగిన ఎన్నికలలో పార్టీ విజయానికి అహర్నిశలు కష్టపడ్డ నాయకుడు. కొత్త రాష్ట్రం… కొత్త ప్రభుత్వంలో తెలంగాణకు ఎంతో కీలకమైన నీటిపారుదల విభాగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేసిన మంత్రి. గడచిన ఐదు సంవత్సరాలలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు తెలంగాణలో లక్షలాది ఎకరాలకు నీరందించారని పేరు తెచ్చుకున్నారు.

అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నఆయన… తెలంగాణ శాసన సభకు రెండోసారి జరిగిన ఎన్నికల అనంతరం హరీష్ రావు మాజీ మంత్రి గా మిగిలారు. అంతేకాదు పార్టీలో సీనియర్ నాయకులు సైతం పలుకరించని పరిస్థితిలో ఉన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భవిష్యత్తులో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావును ముఖ్యమంత్రిని చేసేందుకు హరీష్ రావు ప్రాధాన్యాన్ని తగ్గిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయాలు ఉంటున్నాయని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ… పార్టీలో సీనియర్ నాయకులను స్టార్ క్యాంపెయినర్ లుగా నియమించారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.

ఈ స్టార్ క్యాంపెయినర్ లలో హరీష్ రావు పేరు మాత్రం లేదు. పార్టీలో సీనియర్ నాయకులు అందరికీ స్థానం కల్పించిన కేసీఆర్…. తన మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్ రావును మాత్రం పక్కన పెట్టారు. లోక్ సభ ఎన్నికలకు 20 మంది సీనియర్ నాయకులను స్టార్ క్యాంపెయినర్ లుగా ప్రకటించారు ముఖ్యమంత్రి. వారిలో తన కుమారుడు, కుమార్తె తో సహా తెలంగాణ మంత్రులకు, పార్టీలో సీనియర్ నాయకులకు స్థానం కల్పించారు.

అయితే ఈ జాబితాలో హరీష్ రావు పేరు లేకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక ముందు ముందు హరీష్ రావు ను ఇంటికే పరిమితం చేస్తారా అంటూ పార్టీలో చర్చలు జరుగుతున్నాయి.

బండ ప్రకాష్, టి రవీందర్, శేరి సుభాష్ రెడ్డి వంటి నాయకులకు సైతం ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు.. పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడైన హరీష్ రావును పక్కన పెట్టడం తన కుమారుడికి లైన్ క్లియర్ చేయడమేనని అంటున్నారు. ఈ పరిణామాలు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎలాంటి కుదుపులు తీసుకు వస్తాయోనని పార్టీలో చర్చ జరుగుతోంది.