తండ్రి మహేష్ ని చూసి షాకైన సితార

మహేష్ కూతురు సితార ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె చేసే అల్లరి పనుల్ని స్వయంగా మహేష్ అప్పుడప్పుడు షేర్ చేస్తుంటాడు. అలా ఎప్పటికప్పుడు మహేష్ కు సితార షాకులిస్తూనే ఉంటుంది. అయితే ఈరోజు మాత్రం రివర్స్ లో సితారకు షాకిచ్చాడు మహేష్.

కుటుంబంతో కలిసి తనకు చెందిన ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్సుకు వెళ్లాడు మహేష్. అక్కడ అచ్చంగా మరో మహేష్ లా ఉన్న వ్యక్తిని చూసి సితార షాక్ అయింది. కాసేపు తండ్రిని, ఇంకాసేపు మరో మహేష్ ను అలా చూస్తూ ఉండిపోయింది. అప్పుడు స్వయంగా మహేష్, సితారను మరో మహేష్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఇంతకీ ఆ “మరో మహేష్” ఎవరో తెలుసా? ఓ మైనపు బొమ్మ.

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వహకులు మహేష్ మైనపు ప్రతిమను తయారుచేశారు. దాన్ని ఆవిష్కరించడం కోసం కుటుంబంతో పాటు వచ్చిన మహేష్, ఇలా కూతురికి తన మైనపు బొమ్మను చూపించి మురిసిపోయాడు. అచ్చం తన తండ్రిలా ఉన్న ఆ బొమ్మను చూసి సితార నోరెళ్లబెట్టింది. తర్వాత అది బొమ్మ అని తెలుసుకొని చాలా ఎంజాయ్ చేసింది. త్వరలోనే ఈ విగ్రహాన్ని, సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు షిఫ్ట్ చేయబోతున్నారు.