త్వరలోనే నితిన్ నుంచి మరో ప్రకటన

మొన్నటికిమొన్న చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాను అఫీషియల్ గా ప్రకటించాడు నితిన్. స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో ఆ విషయాన్ని బయటపెట్టాడు. అయితే అదే సమయంలో వెంకీ కుడుములతో చేయాల్సిన సినిమాపై చాలామంది అనుమానాలు వ్యక్తంచేశారు. దీనిపై అప్పట్లో ఎన్నో కథనాలు, పుకార్లు కూడా వచ్చాయి. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుపై కూడా క్లారిటీ ఇచ్చాడు నితిన్.

ఈ నెలలో (మార్చి 30) నితిన్ పుట్టినరోజు ఉంది. ఆ రోజున వెంకీ కుడుముల సినిమాను అఫీషియల్ గా ప్రకటించబోతున్నాడు నితిన్. అంతేకాదు.. ఇప్పటివరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న భీష్మ అనే టైటిల్ లోగోను కూడా ఆరోజు విడుదల చేయబోతున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

ఈ ఏడాదికి సంబంధించి నితిన్ చేయబోయే సినిమాలు ఈ రెండు మాత్రమే. ఈ విషయాన్ని కూడా నితిన్ గతంలోనే స్పష్టంచేశాడు. అయితే వీటిలో ముందుగా సెట్స్ పైకి వచ్చేది చంద్రశేఖర్ ఏలేటి సినిమానే. అది ఓ కొలిక్కి వచ్చిన తర్వాత, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ కుడుముల సినిమా వస్తుంది. చంద్రశేఖర్ ఏలేటి సినిమా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుండగా, వెంకీ కుడుముల సినిమా కామెడీ లవ్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది.