పారాచూట్ తమ్ముళ్లకు దేశం సీనియర్ల నో హెల్ప్!

“దశాబ్దాలుగా ఉన్న ఇద్దరి మధ్య వైరాన్ని చంద్రబాబు నాయుడు తొలగించారు”

“కత్తులు దూసుకున్న నాయకులు కలిసి పనిచేస్తున్నారు”

“బాబు ఫోన్ కాల్ తో  చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్న తెలుగు తమ్ముళ్లు ”

ఇవి ఈ మధ్య కాలంలో పచ్చ మీడియాలో వస్తున్న ప్రధాన కథనాల శీర్షికలు.

ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న ఇద్దరు నాయకులను చంద్రబాబు నాయుడు కలిపారని, వారిద్దరూ ఇప్పుడు ఎలాంటి పొరపొచ్చాలూ లేకుండా కలిసి పనిచేస్తున్నారు అంటూ తెలుగుదేశం పచ్చ మీడియా కథనాలై కూస్తోంది.

అయితే వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉందంటున్నారు. రాయలసీమ జిల్లాల్లో బద్ధ శత్రువులుగా ఉన్న వారే కాదు ఇతర జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సీనియర్ నాయకులకు కూడా స్థానిక తెలుగు తముళ్లు కనీసం సహకరించడం లేదని ఇతర పార్టీల నుంచి వచ్చి టిక్కెట్లు సాధించిన కొత్త తమ్ముళ్లు వాపోతున్నారు.

కర్నూలులో కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కుటుంబాన్ని అట్టహాసంగా పార్టీలో చేర్చుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆయనకు,  ఆయన భార్యకు కూడా టికెట్లు ఇచ్చారు. కోట్ల కుటుంబానికి దశాబ్దాల కాలంగా బద్ధ శత్రువులుగా వున్న కె ఈ. కృష్ణమూర్తి కుటుంబం…. కోట్ల కుటుంబానికి చాలా సహకరిస్తున్నారంటూ ఫొటోలు, కథనాలు ప్రచురిస్తున్నారు.

వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయంటున్నారు. ఈ ఇద్దరు పైకి ఫొటోలు తీయించుకొని సహకరిస్తున్నట్లు చెబుతున్నా లోలోపల మాత్రం వారి ఓటమికి ఏం చేయాలో అన్నీ చేస్తున్నారని తిరిగి కృష్ణమూర్తి వర్గీయులే చెబుతున్నారు.

ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన పనబాక కుటుంబానికి చంద్రబాబునాయుడు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కేంద్ర మాజీ మంత్రి గా పనిచేసిన పనబాక లక్ష్మికి తిరుపతి లోక్ సభ స్థానం టిక్కెట్ కేటాయించారు చంద్రబాబు నాయుడు. అది కూడా ఆమె పార్టీలో చేరిన రెండు రోజుల్లోపే. దీంతో స్థానికంగా ఉన్న తెలుగుదేశం తమ్ముళ్లు, పార్టీ సీనియర్ నాయకులు పనబాక లక్ష్మి ఓటమి కోసం లోలోపల వ్యూహరచన చేస్తున్నారు అంటున్నారు.

తిరుపతి నియోజకవర్గంలో చాలా మంది తెలుగుదేశం నాయకులు పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశారని, కాంగ్రెస్ నుంచి వచ్చిన ప్యారాచూట్ నాయకులకు టికెట్లు ఇవ్వడం ఏమిటంటూ మండిపడుతున్నారు.

వీరే కాకుండా పార్టీలో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ వారు, అయిష్టంగానే లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన వారు కూడా పార్టీ పరాజయానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు.

అమలాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్ అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం నాయకులు వ్యతిరేకిస్తున్నారు. స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులు వయసులో మరీ చిన్నవాడైన హరీష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. తమను పక్కన పెట్టారనే కోపం కోనసీమ తెలుగుదేశం నాయకులు తీవ్రంగా ఉంది అంటున్నారు.

ఇక ఒంగోలు నుంచి పోటీ చేస్తున్న మంత్రి శిద్ధా రాఘవరావు తనకు ఇష్టం లేకపోయినా లోక్ సభ అభ్యర్థిత్వం కట్టబెట్టారని ఆయన కినుక వహించారు. దీంతో శిద్ధా రాఘవ రావు వర్గీయులు ఆయన గెలుపు కోసం కనీసం ప్రయత్నించడం లేదని నాయకులు చెబుతున్నారు.

ఇలా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ఆ పార్టీకి చెందిన వారే సాయశక్తులా ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చెబుతున్నారు.