రాయలసీమ వేషాలు నా వద్ద వేయవద్దు – పవన్

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ తన ప్రసంగంలో ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేసుకున్నట్టుగా ఉంది. కృష్ణా గోదావరి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించిన పవన్ కల్యాణ్…. సొంత బాబాయిని నరికి చంపితే జగన్ ఎందుకు మిన్నకుండిపోవాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. జగన్ ఇంట్లోనే శాంతిభద్రతలు లేనప్పుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ఎలా సేవ చేస్తారని ప్రశ్నించారు.

చిన్న కోడికత్తి గాటుకే జగన్ నానా యాగీ చేశారన్నారు. విజయసాయిరెడ్డి ఇష్టానుసారం మాట్లాడితే తాను ఊరుకోబోనని… అందరి తాటలు తీస్తానని పవన్ హెచ్చరించారు. మరోసారి ప్రాంతాలను కించపరిచే వ్యాఖ్యలు చేశారు పవన్. రాయలసీమ, పులివెందుల వేషాలు తన వద్ద వేస్తే కుదరదన్నారు. తాను అన్నింటికి తెగించి తిరుగుతున్న వ్యక్తినని చెప్పారు.

ముఖ్యమంత్రి అయ్యేందుకు జగన్‌కు ఉన్న అర్హత ఏమిటి అని పవన్ ప్రశ్నించారు. జనసేనను గెలిపించి తనను ముఖ్యమంత్రిని చేస్తే రైతులకు ఐదు వేలు పించన్ ఇస్తూ సీఎంగా తొలి సంతకం చేస్తానని ప్రకటించారు. 3లక్షల ఉద్యోగాల భర్తీ ఫైల్‌పై ముఖ్యమంత్రిగా మరో సంతకం పెడుతానని పవన్ కల్యాణ్ ప్రకటించారు.