చంద్రబాబు కమాన్‌… ఇదే సవాల్

తాను ఏ పదవీ ఆశించి వైసీపీలో చేరలేదన్నారు నటుడు మోహన్‌బాబు. పదవులు ఆశించే వాడినే అయి ఉంటే ముందే పార్టీలోకి చేరి ఉండేవాడినన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి విజయం ఖాయమైపోయిందన్నారు. ఏదీ ఆశించకుండా జగన్‌కు మద్దతు ఇస్తున్నానని చెప్పారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనే తెలుసుకుని ఏదైనా ఇస్తే తీసుకుంటాను గానీ… ముందే పదవులు అడగలేదన్నారు.

జగన్‌ తనకు బంధువని… కానీ బంధువనే పార్టీలోకి చేరలేదన్నారు. తెలుగు ప్రజలకు మంచి చేస్తారన్న ఉద్దేశంతోనే జగన్‌కు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. లేఖలు రాసినా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదన్నారు.

దాంతో ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి వస్తోందన్నారు. చంద్రబాబు వద్ద కాకాపట్టేవారు చాలా మంది ఉంటారని, వారే ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. వైసీపీలో చేరేందుకు మోహన్‌బాబు ప్రయత్నిస్తున్నారన్న టీడీపీ నేతల విమర్శలపై మోహన్‌బాబు సీరియస్‌గా స్పందించారు. తాను ఏ పార్టీలో చేరితే వాడికేమీ అని ప్రశ్నించారు.

పంచభూతాల సాక్షిగా తాను చెబుతున్నానని… తెలంగాణ ప్రభుత్వం ఏ ఒక్కరి మీద కూడా దాడి చేయడం లేదన్నారు.
తాను ఏమీ ఆశించకుండా విద్యాసంస్థలు నడుపుతున్నానన్నారు. తానేమీ రౌడీయిజం చేసి సంపాదించుకోవడం లేదన్నారు.
చంద్రబాబు కూడా పార్టీలోకి రావాలని ఆహ్వానించారని.. కానీ తాను వెళ్లలేదన్నారు. చంద్రబాబు ఆస్తి ప్రారంభంలో ఎంత? ఇప్పుడు ఎంత అని ప్రశ్నించారు.

చంద్రబాబు ఏమైనా పుచ్చలపల్లి సుందరయ్యనా అని ప్రశ్నించారు. తన మొత్తం ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పేందుకు సిద్ధమని… మరి చంద్రబాబు సిద్ధమా అని సవాల్ చేశారు. చంద్రబాబు చెప్పుడు మాటలు విని, అతడి వెంట వెళ్లి ద్రోహం చేశానని ఎన్టీఆర్ చనిపోయినప్పుడే తాను క్షమాపణ కోరానన్నారు.

తాను ధర్నాలు చేసి జగన్‌కు ఓట్లు వేయించాల్సిన అసవరం లేదన్నారు. జగన్‌కు ఓటేసేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ ఒక వండర్‌ఫుల్ లీడర్ అన్నారు. కాంగ్రెస్‌కు తాను విధేయుడినే గానీ… బానిసను కాదని సోనియా వద్దే చెప్పిన వ్యక్తి వైఎస్ అన్నారు. కానీ ఆ తర్వాత ఆయన ఎలా చనిపోయారో అందరికీ తెలుసన్నారు.