నిజామాబాద్‌లో క‌విత‌కు క‌ష్ట‌కాలం !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రైతులు కేసీఆర్‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. రైతు బంధుతో పాటు బీమా ప‌థ‌కాల‌తో రైతులు టీఆర్ఎస్‌కు ఓటేశారు. కేసీఆర్ మ‌ళ్లీ రావాలని కోరుకున్నారు. కానీ ఇప్పుడు అదే రైతులు కేసీఆర్ కూతురు క‌విత‌కు చుక్క‌లు చూపిస్తున్నారు.

నిజామాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో ఏకంగా 179 మంది రైతులు నామినేషన్లు వేశారు. ఎర్ర‌జొన్న‌, ప‌సుపు మ‌ద్ద‌తు ధ‌ర కోసం ఈ రైతులు కొన్నాళ్లుగా ఆందోళ‌న‌లు చేశారు. ఏకంగా రోడ్ల‌మీద ధ‌ర్నాలు చేశారు. కానీ ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. క‌నీసం ప‌రామ‌ర్శించ‌లేదు.

త‌మ ఆందోళ‌న‌ల‌ను ప‌ట్టించుకోని అధికారపార్టీకి ఇప్పుడు రైతులు చుక్క‌లు చూపిస్తున్నారు. ఏకంగా 179 మంది రైతులు నామినేష‌న్లు వేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వీరికి కావాల్సిన ఎన్నిక‌ల ఖ‌ర్చును రైతుల‌కు సంబంధించిన గ్రామ అభివృద్ధి కమిటీలు సేక‌రించాయి. 179 మంది రైతుల నామినేష‌న్ల‌తో ఇప్పుడు క‌విత టెన్ష‌న్ ప‌డుతున్నారు.

నిజామాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో నిజామాబాద్ అర్బ‌న్ ఒక‌టే పూర్తి అర్బ‌న్ ఏరియా. మిగ‌తా ప్రాంతం మొత్తం గ్రామీణం. ఇక్క‌డ రైతుల ఓట్లే కీల‌కం. ఇప్పుడు 179 మంది గ్రామాల రైతులు బ‌రిలో ఉండ‌డంతో అధికార పార్టీ ఓట్ల‌కు పెద్ద గండి ప‌డుతుంది. దీంతో క‌విత గెలుపుపై ప్ర‌భావం చూపుతోంది. అటు బీజేపీ త‌ర‌పున అర‌వింద్‌, కాంగ్రెస్ నేత మ‌ధుయాష్కీ రంగంలో ఉన్నారు. దీంతో ఓట్ల చీలిక‌తో త‌న‌కు ఎక్కడ ఎస‌రు వ‌స్తుందో అని క‌విత తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారు.

ఇప్ప‌టికే రైతులు నామినేష‌న్లు వేయ‌కుండా జిల్లా మంత్రులు,ఎమ్మెల్యేలు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. వారి నామినేష‌న్లు వేశారు. ఈ రెండురోజుల్లో వారు నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకోక‌పోతే…..నిజామాబాద్ పార్ల‌మెంట్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా జ‌రిగే అవ‌కాశాలు మాత్రం క‌న్పిస్తున్నాయి.