రకుల్ ను వద్దని తేల్చిచెప్పిన మహేష్

హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా హీరోయిన్లకు ఛాన్స్ ఇస్తుంటాడు మహేష్. గతంలో కాజల్ కు అలానే అవకాశం ఇచ్చాడు. సమంత విషయంలో కూడా అదే జరిగింది. కాబట్టి ఇప్పుడు రకుల్ కు కూడా మహేష్ మరో అవకాశం ఇస్తాడని అంతా భావించారు. కానీ మహేష్ మాత్రం షాక్ ఇచ్చాడు. రకుల్ ను వద్దని చెప్పేశాడు.

త్వరలోనే అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు మహేష్. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మాతలుగా ఆ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా రకుల్ ను అనుకున్నారు. అదే విషయాన్ని మహేష్ వద్ద ప్రస్తావించారు. రకుల్ పేరు చెప్పగానే మహేష్ నో చెప్పాడట.

గతంలో వీళ్లిద్దరి కాంబోలో స్పైడర్ లాంటి డిజాస్టర్ వచ్చింది. మళ్లీ ఆమెతో సినిమా చేస్తే స్పైడర్ సినిమా మరోసారి తెరపైకి వస్తుందని మహేష్ భయపడుతున్నాడట. అందుకే రకుల్ వద్దని చెప్పేశాడట. ఇదొక కారణమైతే, ఈమధ్య కాలంలో రకుల్ ట్రాక్ రికార్డ్ అంత బాగాలేదు. ఆమెను రిజెక్ట్ చేయడానికి ఇది కూడా ఓ కారణం.

రకుల్ ను వద్దనుకున్న తర్వాతే మహేష్-అనీల్ రావిపూడి సినిమాలో రష్మికను హీరోయిన్ గా ఎంపిక చేశారు. మహర్షి విడుదల తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ ఎవరనే విషయంపై చర్చలు సాగుతున్నాయి.