పెళ్లి తర్వాత నిహారిక పరిస్థితేంటి?

తనకు చాలా తక్కువ టైమ్ ఉందని, పెళ్లయిన తర్వాత కెరీర్ ను కొనసాగించలేనని, కాబట్టి తన మనసుకు నచ్చిన సినిమాలు చేస్తున్నానని ఈమధ్య ప్రకటించింది నిహారిక. అప్పటి ఆ స్టేట్ మెంట్ కు చిన్న సవరణ చేసింది ఇప్పుడు. పెళ్లి తర్వాత తన కెరీర్ కు బ్రేక్ పడుతుందని, కాకపోతే కచ్చితంగా సినిమాలు చేయను అనే రూల్ మాత్రం పెట్టుకోలేదంటోంది నిహారిక.

ఇంట్లో చూసిన సంబంధమే చేసుకుంటానంటున్న ఈ మెగా బ్యూటీ, వచ్చే వ్యక్తి ఒప్పుకుంటే పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటిస్తానని క్లారిటీ ఇచ్చింది. అయితే అప్పుడు కూడా తన మనసుకు నచ్చిన సినిమాలే చేస్తానని అంటోంది. అయితే పెళ్లి తర్వాత ఫ్యామిలీ చాలా ముఖ్యమని, పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న తర్వాత అప్పుడు సినిమాల గురించి మరోసారి ఆలోచిస్తానంటోంది నిహారిక.

సూర్యకాంతం సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన నిహారిక తన డ్రీమ్ మూవీని బయటపెట్టింది. మణిరత్నం దర్శకత్వంలో చేయాలనేది తన డ్రీమ్ అని, తన ఫేవరెట్ డైరక్టర్ అతడే అంటోంది. మణిరత్నంతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా చేయాలని ఉందని, ఫిదా టైమ్ లో కమ్ములను కలిశానని చెప్పుకొచ్చింది.