చివరి రోజున ఆ కుటుంబానికి నాలుగు టిక్కెట్లు

పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చివరి రోజుల్లో నీతి నియమాలను గాలికి వదిలేశారన్న చర్చ సాగుతోంది. పార్టీ ఫిరాయింపు దారులకు తన జనసేనలో చోటు లేదని.. పార్టీలు మారే వారిని తన పార్టీలో చేర్చుకోనన్న పవన్.. తాజాగా సోమవారం చివరి రోజు పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడైన కర్నూలు మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చారు.

తాజాగా పవన్ ఎస్పీవైరెడ్డికి కర్నూలు ఎంపీ సీటుతోపాటు ఆయన కుటుంబీకులకు నాలుగు సీట్లు కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి, ఆయన కూతుళ్లు సుజలకు శ్రీశైలం, చిన్న కూతురు అరవిందవాణికి బనగానపల్లె, నంద్యాల ఎమ్మెల్యేగా ఎస్పీవై అల్లుడు శ్రీధర్ రెడ్డి కి సీట్లు కేటాయించారు.

అన్నీ కర్నూలు ఎంపీ పరిధిలోనివే…. ఇలా పవన్ ఎస్పీవై రెడ్డికి ఫ్యామిలీ ప్యాకేజ్ సీట్లు ఇచ్చేశారు. పోయిన సారి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి కర్నూలు ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి గెలవగానే టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి ఆ పార్టీలో చేరి వైసీపీ అధినేత జగన్ ను మోసం చేశారు.

ఇప్పుడు టీడీపీ అధినేత బాబు టికెట్ ను నిరాకరించాడు. దీంతో ఎటూ పాలుపోని ఎస్పీవై రెడ్డి జనసేనలోకి రాగా.. పవన్ ఆదరించాడు.

తన పార్టీలో ఫిరాయింపు దారులకు చోటులేదన్న పవన్.. ఇన్ని పార్టీలు మారి ఇంత రాజకీయం చేసిన ఎస్పీవై రెడ్డికి జనసేనలో టికెట్ ఇవ్వడం.. అదీ కుటుంబ సభ్యులందరికీ ఇచ్చేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.