ఉపగ్రహాలు కూల్చే ‘శక్తి’ని విజయవంతంగా ప్రయోగించిన భారత్

స్పేస్ వార్‌కు భారత దేశం సిద్దమైంది. ఇప్పటికే ఎన్నో రకాల క్షిపణులను పరీక్షించిన భారత్.. తాజాగా అంతరిక్షంలోని ఉపగ్రహాలను కూల్చే శక్తిని కూడా సొంతం చేసుకుంది. ప్రపంచంలో ఉపగ్రహాలను కూల్చే శక్తి కేవలం అమెరికా, రష్యా, చైనాలకే ఉంది ఇప్పటి వరకు. తాజాగా భారత్ ఈ దేశాల సరసన చేరింది.

డీఆర్‌డీఏ శాస్త్రవేత్తలు రూపిందించిన మిషన్ శక్తి ఆపరేషన్ విజయవంతమైనట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ప్రకటించారు. అత్యంత కఠినమైన ఈ ఆపరేషన్ ద్వారా అంతరిక్షంలోని ఉపగ్రహాన్ని పడగొట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏ-శాట్ అనే ఆర్బిట్ శాటలైట్‌ను కేవలం మూడు నిమిషాల్లో పడగొట్టి రికార్డు సృష్టించారు.

అయితే ఈ ఆపరేషన్ ఏ దేశానికి వ్యతిరేకంగానో చేసింది కాదని.. కేవలం భారత శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాలకు తెలియజేయడానికే ఈ ప్రయోగం చేశామని మోడీ చెప్పారు. ఇప్పటికే వ్యవసాయం, విపత్తు నిర్వహణ, కమ్యునికేషన్స్, వాతావరణం, నావిగేషన్ రంగాలకు సంబంధించి ఎన్నో శాటిలైట్లను ప్రయోగించామని.. ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించిన శాటిలైట్లు అభివృద్ది చేయడం దేశానికే గర్వకారణమని మోడీ తెలిపారు.