మూలికల ప్రదాయిని…. అరటి….

అరటి. ప్రకృతి ప్రసాదించిన గొప్ప చెట్టు. ప్రకృతిలో ఏ చెట్టుకు లేని గొప్పతనం అరటి సొంతం. ఈ చెట్టులో ప్రతీ భాగం ఉపయోగపడేదే. అరటి కాయ, అరటి పండు, అరటి ఆకు, అరటి దూట (అరటి చెట్టు లోపల ఉండే కాండం) అరటి పువ్వు.. ఇలా అన్ని భాగాలు ఉపయోగకరం.. అంతే కాదు… ఎంతో ఆరోగ్యం.

సీజన్ తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా కాసే ఒకే ఒక్క చెట్టు అరటి. అరటి కాయ, అరటి పండు ఏ ప్రాంతానికి వెళ్లినా సంవత్సరమంతా దొరుకుతాయి. రోజు ఆహారంలో ఏదో రూపంలో అరటిని తీసుకుంటే సర్వరోగాల నివారణ సాధ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అరటి వల్ల కలిగే ప్రయోజనాలు తెల్సుకుందాం.

 • అరటి ఆకు. ఎన్నో పోషకాలను నిక్షిప్తం చేసుకున్న ఆకు. అరటి ఆకులో భోజనం పోషకాలను అందించడమే కాదు…. చాలా రుచిగా ఉంటుంది. అరటి ఆకులో వేడి వేడి అన్నం వేసుకుని తింటే ఆ ఆకులో ఉన్న పోషకాలు ఆహారంలో కలిసి ఎంతో బలాన్ని ఇస్తాయని వైద్య శాస్త్రం చెబుతోంది.
 • అరటి ఆకులో భోజనం చేస్తే జుత్తు నల్లగా మారుతుంది.
 • అరటి ఆకులో పోటిఫెనోల్స్ అనే సహజ అమ్ల జనకాలు ఉంటాయి. ఈ ఆమ్ల జనకాలు చర్మ సంబంధిత వ్యాధులను అరికడతాయి.
 • రే చీకటి వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా అరటి కాయ, కాని అరటి పండు గాని తీసుకుంటే ఈ వ్యాధి నెమ్మదిగా తొలిగిపోతుంది.
 • కాలిన బొబ్బల మీద కొద్దిగా కొబ్బరి నూనె రాసి దానిపై అరటి ఆకు కప్పితే ఆ బొబ్బలు త్వరగా నయం అవుతాయి.
 • అరటిలో ఫైబర్ ఎక్కువగా ఉన్న కారణంగా మలబద్దకాన్ని నివారిస్తుంది.
 • అరటిలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటు, గుండెకు సంబంధించిన వ్యాధులకు చెక్ పెడుతుంది.
 • అరటిని ఏ రూపంలో తీసుకున్నా అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది… కంటికి సంబంధించిన వ్యాధులు, గ్యాస్ సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అరటి కాపాడుతుందని వైద్య శాస్త్రం చెబుతోంది.
 • అరటి పువ్వులో పెరుగు కలుపుకుని తింటే (పెరుగు పచ్చడి) స్త్రీలను వేధించే వ్యాధులను అరికడుతుంది.
 • అరటి పువ్వు కూర తింటే కడుపులో పేరుకుపోయిన క్రిములు మూత్రం, మలం ద్వారా బయటకు వస్తాయి.
 • అరటి చెట్టు పై భాగం మాత్రమే మేలు చేయదు. అరటి చెట్టులోని లోపలి భాగం కూడా ఎంతోమేలు చేస్తుంది. దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు. దీన్ని దూట, దవ్వ, ఊచ అని కూడా అంటారు. తెల్లగా…. ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ లోపలి భాగాన్ని కూర, పచ్చడి, పప్పు ధాన్యాలతో కలిపి వండితే…. రుచికి రుచి….. ఆరోగ్యానికి ఆరోగ్యం. దీన్ని తీసుకోవడం వల్ల మల బద్దకం, శ్లేష్మం, వాతపు నొప్పులు, పైత్యం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.