సంపద సృష్టించడం అంటే…. అప్పులు పెంచడమా? బాబూ !

చంద్రబాబు ఉపన్యాసం ప్రారంభించాడంటే…. రాష్ట్ర సంపద పెంచా…. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశా…. టెక్నాలజీని పరిచయం చేశా….. అంటూ…. ఈ మూడు విషయాలు చెప్పకుండా ఆయన ఉపన్యాసం సాగదు.

రాష్ట్ర సంపద పెంచడం అంటే ఆయన కవి హృదయం ఏమిటో…. ఆర్థిక విషయాలు తెలిసిన వారికి ఒక మాత్రాన బోధపడదు. ఆయన పరిపాలనా కాలంలో ఎప్పుడూ ఆర్థిక వ్యవహారాలు అస్తవ్యస్తమే. ఊరికే…. ఊకదంపుడుగా గణాంకాలు చదవడం…. ఎల్లో మీడియా ఆహా ఓహో అంటూ ఆ గణాంకాలను ఆకాశానికెత్తడం తప్ప…. ఆయన పరిపాలనా కాలంలో సంపద సృష్టించిన దాఖలాలు లేవు…. కుప్పలు తెప్పలుగా అప్పులు తేవడం తప్ప…. ఓవర్‌ డ్రాఫ్ట్‌ కు వెళ్ళందే రోజులు గడవని దుస్థితిని కల్పించడం తప్ప…. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడిన ఉదంతం ఒక్కటీ లేదు.

కొత్త రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 20 శాతం ఉండేవి. ఈ నాలుగున్నరేళ్ళలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 35 శాతానికి చేరాయని చెబుతున్నారు ఆర్థికవేత్తలు. అంటే 13 జిల్లాల ఇంత చిన్న రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేయడం ఆయనకే చెల్లింది. అదేమంటే నేను ఎకనామిక్స్‌ లో మాస్టర్ ని అంటాడు.

నాకు ఎకనామిక్స్‌ స్పెల్లింగ్‌ తెలియదు…. కంప్యూటర్‌ గురించి కనీస పరిజ్ఞానం లేదు…. టచ్‌ స్క్రీన్‌ ఫోన్‌ల గురించీ కూడా తెలియదు అనే రోశయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందిందీ పోల్చి చూసుకుంటే చంద్రబాబు ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ ఎంత డొల్లో అర్థమౌతుంది.

ఇప్పుడే కాదు…. చంద్రబాబు తొమ్మిదేళ్ళ పరిపాలనా కాలంలోను ఇబ్బడి ముబ్బడిగా…. అందినంత అప్పులు చేసి ఆ భారాన్నంతా తరువాత వచ్చిన రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం మీద మోపి వెళ్ళాడు. చంద్రబాబు దిగిపోయేనాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల వాటా 30 శాతంగా ఉండేది.

ఆ తరువాత అధికారానికి వచ్చిన రాజశేఖర్‌ రెడ్డి, రోశయ్యలు ఆ అప్పును 30 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు. మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ 20 శాతం అప్పులను 35 శాతానికి తీసుకొచ్చాడు….. ఇదీ అయన ఆర్థిక శాస్త్ర ప్రతిభ…. సంపద సృష్టించడం అంటే అప్పులు సృష్టించడం అనుకుంటున్నాడు కాబోలు.

ఇది చాలదన్నట్టు ఎక్కువ వడ్డీ రేటుకు అప్పులు తేవడం చంద్రబాబు ప్రత్యేకత. వడ్డీలు కట్టాల్సింది ఆయన కాదు కదా!

ఈ నాలుగేళ్ళ కాలంలో మన ఆదాయంలో పరిశ్రమల నుంచి వచ్చే వాటా, సేవా రంగం నుంచి వచ్చే వాటా బాగా తగ్గిపోయాయి. అంటే ఈ నాలుగేళ్ళలో ఆ రంగాలు దెబ్బతిన్నాయని అర్థం. అలాగే ప్రజల తలసరి ఆదాయం కూడా గత దశాబ్దంతో పోలిస్తే ఉండాల్సిన పెరుగుదలలో 50శాతం పడిపోయింది.

ఇవన్నీ గమనిస్తే చంద్రబాబు ఏమి చూసుకుని ఈ రాష్ట్రానికి సంపద సృష్టించానని అంటున్నాడో, అభివృద్ధి వైపు తీసుకెళ్ళానంటున్నాడో అర్థం కాదు…! ఆర్థికవేత్తలకు అయితే అసలే అర్థం కాదు…!!