Telugu Global
NEWS

ఇప్పుడు చంద్రబాబు భయమంతా.... పవన్‌ కళ్యాణే ?

ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్దీ గెలుపోటముల పై చంద్రబాబుకు స్పష్టత వస్తూ ఉంది. పరిపాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ అయిన చంద్రబాబు పార్టీ నిర్మాణంలో మాత్రం సూపర్‌ హిట్‌ అయ్యాడు. ఇన్ని రోజులూ తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా నిలబడిందంటే అదంతా చంద్రబాబు నాయుడు గొప్పతనమే.  టీడీపీకి ప్రజాకర్షణ ఎన్టీఆర్‌ అయితే…. పార్టీని బూత్ స్థాయి వరకూ పటిష్టంగా నిర్మించింది చంద్రబాబే. ఎవరు అంగీకరించినా… అంగీకరించక పోయినా…. ఒకటి మాత్రం నిజం. ఆయనకు పరిపాలన చేత రాదు. మీడియాను […]

ఇప్పుడు చంద్రబాబు భయమంతా.... పవన్‌ కళ్యాణే ?
X

ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్దీ గెలుపోటముల పై చంద్రబాబుకు స్పష్టత వస్తూ ఉంది. పరిపాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ అయిన చంద్రబాబు పార్టీ నిర్మాణంలో మాత్రం సూపర్‌ హిట్‌ అయ్యాడు. ఇన్ని రోజులూ తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా నిలబడిందంటే అదంతా చంద్రబాబు నాయుడు గొప్పతనమే.

టీడీపీకి ప్రజాకర్షణ ఎన్టీఆర్‌ అయితే…. పార్టీని బూత్ స్థాయి వరకూ పటిష్టంగా నిర్మించింది చంద్రబాబే.

ఎవరు అంగీకరించినా… అంగీకరించక పోయినా…. ఒకటి మాత్రం నిజం. ఆయనకు పరిపాలన చేత రాదు. మీడియాను మేనేజ్‌ చేయడం, పార్టీని నిర్మించడం ఆయనకు తెలిసినట్లు ఈ దేశంలో మరో రాజకీయ నాయకుడికి తెలియదు. ఎన్నికల్లో జిమ్మిక్కులు చేయడం, ఎత్తులు, పై ఎత్తులు వేయడం ఆయన తరువాతే ఎవరైనా. ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ లో ఆయనది డాక్టరేట్‌.

ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే…. మరో పదిరోజుల్లో జరగబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న నమ్మకం ఆయనలో సన్నగిల్లుతోంది. చాలా రోజుల క్రితమే తన అపజయాన్ని గుర్తెరిగినా…. గెలుపుకు అవసరమైన అన్ని యత్నాలూ చేశాడు. అయినా గెలుస్తామన్న నమ్మకం ఆయనకు కలగడం లేదు.

దాంతో పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో పడ్డాడు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ఓకే. లేకపోతే? వచ్చే ఎన్నికల నాటికి ఇలా ఎన్నికల్లో పోరాడేందుకు ఆయన ఆరోగ్యం సహకరించకపోవచ్చు. పార్టీలో చంద్రబాబు ఎప్పుడు వీక్‌ అవుతాడో… సమస్యలు అక్కడినుంచే ప్రారంభం అవుతాయి. 2024 ఎన్నికల నాటికి పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లో కొనసాగితే…. ఆరోగ్యం సహకరించక చంద్రబాబు యాక్టీవ్‌ పాలిటిక్స్‌లో లేకపోతే…. టీడీపీ క్యాడర్‌ చాలా వరకు పవన్‌ కళ్యాణ్‌ వెంట వెళ్ళిపోతుంది…. ఇప్పుడు చంద్రబాబు భయమంతా ఇదే…!

టీడీపీని అభిమానించే బలమైన కమ్మ సామాజిక వర్గం టీడీపీతోనే ఉంటుంది. కానీ బీసీలు పవన్‌ కళ్యాణ్‌ వైపు వెళ్ళే అవకాశం ఉంది.

ఎందుకంటే…. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టు పార్టీలు చాలా బలమైనవి. అయితే అవి టీడీపీతో పొత్తు పెట్టుకున్నాక…. ఆ పార్టీల్లోని చాలామంది కార్యకర్తలు టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు క్యాడర్‌ కోల్పోయి చాలా దెబ్బతిన్నాయి.

అలాగే కాంగ్రెస్‌ పార్టీ కూడా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాక…. కొద్ది రోజుల్లోనే ఎలా దెబ్బతినిందో చూశాం.

ఇప్పుడు చంద్రబాబు భయం కూడా అదే. ఒక వేళ ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే…. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబుకు వయసు మీద పడుతుంది. ఇప్పటిలాగా ఎన్నికల్లో పోరాడలేకపోవచ్చు…. పార్టీని కాపాడుకునే శక్తి లోకేష్‌కు లేదు…. పవన్‌ కళ్యాణ్‌ ఇంకా యువకుడికిందే లెక్క. ఈ ఎన్నికల్లో పైకి కనిపించకపోయినా లోలోపల జనసేన, టీడీపీ క్యాడర్‌లు కలిసి పనిచేస్తున్నాయి. ఇదే చంద్రబాబు భయం ఇప్పుడు.

ఈ ఎన్నికల తరువాత తమ క్యాడర్‌ కొంత పవన్‌ కళ్యాణ్‌ వెంట వెళ్ళిపోతుందని చాలా భయపడుతున్నాడు. అందుకే ఈ ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ పవన్‌ కళ్యాణ్ గెలవకూడదు. ఆయన పార్టీకి కూడా విజయం లభించకూడదు…. ఇప్పుడు ఇదే చంద్రబాబు లక్ష్యం. దానికి ఏం చేయాలో అదే చేస్తాడు. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాడు…. అంటున్నారు.

First Published:  2 April 2019 5:30 AM GMT
Next Story