ఐపీఎల్ -12లో పంజాబ్ బౌలర్ తొలి హ్యాట్రిక్

  • మొహాలీ మ్యాచ్ లో ఢిల్లీకి కింగ్స్ పంజాబ్ ఝలక్
  • సామ్ కరెన్ హ్యాట్రిక్ తో ఢిల్లీ క్యాపిటల్స్ గల్లంతు
  • ఐపీఎల్ లో హ్యాట్రిక్ సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన బౌలర్ సామ్

ఐపీఎల్ 12వ సీజన్ రెండోవారం పోటీలలో….ఎట్టకేలకు తొలి హ్యాట్రిక్ నమోదయ్యింది. మొహాలీ లోని పంజాబ్ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచ్ లో…. ఆతిథ్య కింగ్స్ పంజాబ్ యంగ్ గన్ సామ్ కరెన్ హ్యాట్రిక్ నమోదు చేశాడు.

ఐపీఎల్ 12 సీజన్ల చరిత్రలో అతిపిన్న వయసులో హ్యాట్రిక్ సాధించిన బౌలర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 

సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచ్….

20 ఓవర్లలో 167 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆట 17వ ఓవర్ కే 3 వికెట్లకు 144 పరుగుల స్కోరుతో విజయానికి చేరువగా వచ్చింది.

అయితే…అలాంటి స్థితిలో బౌలింగ్ కు దిగిన 20 ఏళ్ల పంజాబ్ లెఫ్టామ్ పేసర్ సామ్ కరెన్… వరుస బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి… హ్యాట్రిక్ తో ఆట స్వరూపాన్నే ఒక్కసారిగా మార్చి వేశాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, కరెన్ దెబ్బతో… ఢిల్లీ క్యాపిటల్స్ 152 పరుగుల స్కోరుకే కుప్పకూలింది.

దీంతో కింగ్స్ పంజాబ్ 14 పరుగుల సంచలన విజయంతో లీగ్ టేబుల్ అగ్రభాగాన నిలిచింది.

7 కోట్ల 20 లక్షల ధర…

ఐపీఎల్ 12వ సీజన్ వేలంలో 7 కోట్ల 20 లక్షల రూపాయల కాంట్రాక్టు దక్కించుకొన్న సామ్ కరెన్ 20 ఏళ్ల చిరుప్రాయంలోనే ఐపీఎల్ హ్యాట్రిక్ సాధించడం ద్వారా వారేవ్వా అనిపించుకొన్నాడు.

జింబాబ్వే మాజీ ఫాస్ట్ బౌలర్ కెవిన్ కరెన్ కుమారుడు, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ టామ్ కరెన్ తమ్ముడుగా గుర్తింపు ఉన్న సామ్ కరెన్ కు 9 టెస్టుమ్యాచ్ ల్లో 15 వికెట్లు సాధించిన ఘనత సైతం ఉంది.