Telugu Global
National

ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం 'మేఘా' హంద్రీ-నీవా

6 లక్షల ఎకరాలకు సాగునీరు…. 33 లక్షల మందికి తాగునీరు…. హంద్రీనీవా సుజల స్రవంతి… రాయలసీమకు జీవనాడి లాంటిది. దశాబ్దాలుగా అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని సస్యశామలం చేయడం కోసం మేఘా చేపట్టిన అద్భుతమైన పథకం హంద్రీనీవా. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు 81 మండలాల్లోని 437 గ్రామాల్లోని 33 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించడం హంద్రీనీవా ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్‌లో […]

ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం మేఘా హంద్రీ-నీవా
X

6 లక్షల ఎకరాలకు సాగునీరు…. 33 లక్షల మందికి తాగునీరు….

హంద్రీనీవా సుజల స్రవంతి… రాయలసీమకు జీవనాడి లాంటిది. దశాబ్దాలుగా అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని సస్యశామలం చేయడం కోసం మేఘా చేపట్టిన అద్భుతమైన పథకం హంద్రీనీవా. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు 81 మండలాల్లోని 437 గ్రామాల్లోని 33 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించడం హంద్రీనీవా ముఖ్య ఉద్దేశం.

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మేఘా అత్యంత సుదూర ప్రాంతాలకు, ఎత్తైన ప్రాంతానికి నీటిని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా పంపింగ్‌ చేస్తోంది. 2012లోనే అత్యంత క్లిష్టమైన ఈ ప్రాజెక్ట్‌ మొదటిదశను మేఘా పూర్తి చేసింది. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ మొదటిదశలోనే 8 పంపింగ్‌ స్టేషన్లను మేఘా నిర్మించింది. ప్రతీ పంపింగ్‌ స్టేషన్‌లోనూ 12 చొప్పున భారీ పంపింగ్‌ సెట్ లు ఉన్నాయి. వీటితో సరాసరిన 200 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్‌ చేస్తున్నారు.

వైఎస్‌ రాజశేఖర రెడ్డి మొండి పట్టుదల….

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి 2006లో ఈ పథకాన్ని చేపట్టినప్పుడు ఈ పథకాన్ని అమలు చేయడానికి నిధులు ఎక్కడివి, నీళ్లు ఎక్కడివి అనే ప్రశ్నలు తలెత్తాయి. పంపులు, మోటార్ల నిర్వాహణ సాధ్యమవుతుందా? అని ప్రశ్నించినవారు చాలామంది ఉన్నారు. చిన్నపాటి ఎత్తిపోతల పథకాలను ఐడిసీ, ఆర్‌ఐసీ లాంటి సంస్థలే నిర్వహించలేక మూతపడుతుంటే భారీ స్థాయిలో పంపుహౌస్‌లను నిర్వహించడం సాధ్యమవుతుందా? అనే ప్రశ్నలను లేవదీశారు. అయినా ఆయన దూరదృష్టితో, మొండి పట్టుదలతో ఈ పథకాన్ని చేపట్టారు.

ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం….

ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా హంద్రీనీవా గుర్తింపు పొందింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కాళేశ్వరం, దేవాదుల, కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి తదితర ఎత్తిపోతల పథకాలు బాగా పెద్దవైనప్పటికీ వాటి నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కానందున ప్రస్తుతానికి ఆసియాలో అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా హంద్రీ-నీవా గుర్తింపు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే అమెరికాలోని కాలిఫోర్నియాలో దాదాపు 80 ఏళ్ల కిందటే ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన, ఎత్తైన ప్రాంతానికి నీటిని పంపింగ్‌ చేసే తాగు, సాగు నీటి పథకాలు చేపట్టారు.

ఈ రికార్డును త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు బద్దలు కొట్టనుంది. కానీ ఇప్పటివరకు పూర్తైన ఎత్తిపోతల పథకాల్లో హంద్రీ-నీవా ప్రాజెక్ట్‌లో మోటార్లు, పంపుల సంఖ్యా పరంగానూ, పంప్‌హౌస్‌ల నిర్మాణ పరంగానూ, ప్రాజెక్ట్‌ పొడవు విషయంలోనూ ప్రత్యేకతలను సంతరించుకుంది. హంద్రీనీవా ప్రాజెక్టులో మేఘా చేపట్టిన ఎలక్ట్రోమెకానికల్‌ పనులు కీలకమైనవి.

రెండు దశల్లో…

మొత్తం 565 కిలోమీటర్ల హంద్రీనీవా ప్రధాన కాలువను రెండు దశలుగా చేపట్టారు. మొదటిదశ కర్నూలు జిల్లా మాల్యాల నుంచి అనంతపురం జిల్లాలోని జీడిపల్లి వరకు 216 కిలోమీటర్ల వరకు ఇప్పటికే మేఘా పూర్తి చేసి గత ఎనిమిదేళ్లుగా నిరాటంకంగా నీటిని ఎత్తిపోస్తున్నది.

రెండో దశ పనులను కూడా అప్పుడే ప్రారంభించారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి. రెండవదశ పనులు జీడిపల్లి నుంచి అంటే 216 కిలోమీటర్‌ నుంచి అడవిపల్లి జలాశయం వరకు (చిత్తురు జిల్లా) అంటే 565 కిలోమీటర్‌ వరకు పూర్తి చేసింది.

అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు….

హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పథకం రెండో దశలో భాగంగా అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని 4,04,500 ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. అందుకు అనుగుణంగా మేఘా జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌కు నీరు అందేలా ఏర్పాటు చేసింది. మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా పెనుకొండ, హిందూపూర్‌, మడకశిర అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 74,400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 19 పంప్‌ హౌజ్‌లను మేఘా నిర్మించింది.

జీడిపల్లి రిజర్వాయర్‌ వద్ద మడకశిర ప్రధాన కాలువపై ఏర్పాటు చేసిన జీడిపల్లి పంప్‌ హౌజ్‌లో ఒక్కోటి 1.40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 8 పంపులను మేఘా ఏర్పాటు చేసింది. జీడిపల్లి పంప్‌ హౌజ్‌ నుంచి మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ పై 155.2 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న 18 పంప్‌ హౌజ్‌లకు నీరు అందుతుంది.

మడకశిరలో ఎల్‌-1 నుంచి ఎల్‌-17 మరియు ఎల్‌-4 పంప్‌ హౌజ్‌ లో మొత్తం 81 పంపులను మేఘా ఏర్పాటు చేసింది. వీటి మొత్తం సామర్థ్యం 83.41 మెగావాట్లు. ఈ పంప్‌ హౌజ్‌ ద్వారా మొత్తం 374 మీటర్ల ఎత్తుకు 229.26 క్యూమెక్స్‌ నీటిని ఎత్తిపోస్తారు. మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ పై 1.61 టీఎంసీల సామర్థ్యం కలిగిన గొల్లపల్లి రిజర్వాయర్‌, అదే విధంగా జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కాలువ ద్వారా మారాల రిజర్వాయర్‌ కు నీరు అందుతుంది. ఇక్కడి నుంచి పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ ప్రారంభమవుతుంది.

పుంగనూర్‌ బ్రాంచ్‌ కెనాల్‌ అనంతపురం జిల్లా కదిరి వద్ద మొదటి పంప్‌ హౌజ్‌ పీ1 నుంచి 181 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్తూరు జిల్లా మదనపల్లి వద్ద ఉన్న చివరి పంప్‌ హౌజ్‌ పీ16 వరకు మొత్తం 16 పంప్‌హౌజ్‌లను మేఘా నిర్మించింది. వీటి ద్వారా 244.86 క్యూమెక్స్‌ నీటిని 350 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోస్తున్నారు.

First Published:  4 April 2019 12:20 AM GMT
Next Story