రాహుల్ కు జింటా జింతాన జింతాన….

  • మహిళలంటే ఎనలేని గౌరవమంటూ ప్రశంసలు
  • రాహుల్ పై విచారణ దురదృష్టకరమంటున్న ప్రీతి జింటా

టీమిండియా కమ్ కింగ్స్ పంజాబ్ యువ ఓపెనర్ కెఎల్ రాహుల్ పై…. మొహాలీ ఫ్రాంచైజీ కోఓనర్ ప్రీతి జింటా ప్రశంసల వర్షం కురిపించింది. రాహుల్ కు మహిళలంటే ఎంతో  గౌరవమని చెప్పింది.

కాఫీ విత్ కరెన్ షోలో హార్ధిక్ పాండ్యాతో కలిసి పాల్గొన్న రాహుల్… మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణల పై… గతంలో సస్పెన్షన్ కు గురికావడంతో పాటు… ప్రస్తుతం బీసీసీఐ విచారణ సైతం ఎదుర్కొంటున్నాడు.

రాహుల్ లాంటి మంచి క్రికెటర్ పై విచారణ దురదృష్టకరమని, సెలబ్రిటీలకు ఇలాంటి బాధలు తప్పవని ప్రీతీ జింటా అంటోంది. ఐపీఎల్ గత సీజన్ వేలంలో… రాహుల్ ను మొహాలీ ఫ్రాంచైజీ 11 కోట్ల రూపాయల రికార్డు ధరకు సొంతం చేసుకొన్న సంగతి తెలిసింది.

ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడింట కింగ్స్ పంజాబ్ జట్టు విజేతగా నిలవడంతో.. ప్రీతీ జింటా ఆనందానికి అంతేలేకుండా ఉంది. ఐపీఎల్ టైటిల్ సాధించాలన్నదే తమ లక్ష్యమని ప్రకటించింది.

తమజట్టులో ఎందరు ఆటగాళ్లున్నా… వ్యక్తిగతంగా తనకు క్రిస్ గేల్ అంటే ఎంతో ఇష్టమని…కష్ట సుఖాలను, జయాపజయాలను ఒకేలా స్వీకరించే తత్వం గేల్ లో ఉందని… ప్రీతి చెప్పింది.

రాహుల్ పై ఓవైపు బీసీసీఐ నియమించిన ఆంబుడ్స్ మన్ విచారణ నిర్వహిస్తుంటే…మరోవైపు…ఐపీఎల్ మొహాలీ ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింటా మాత్రం… మర్యాదస్తుడంటూ కితాబివ్వడం, దురదృష్టకరమంటూ సమర్థించడం విశేషం.