ఆరుమ్యాచ్ లు… ఆరు పరాజయాలు

  • ఐపీఎల్ -12లో విరాట్ కొహ్లీ టీమ్ వెలవెల
  • బెంగళూరు డబుల్ హ్యాట్రిక్ ఓటమిల బెంగతీరేదెలా?
  • బ్యాటింగ్ ఘనం…బౌలింగ్ శూన్యం!

ఐపీఎల్ 12వ సీజన్ తొలిఅంచె పోటీలలో …మాజీ రన్నరప్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ పరిస్థితి ఇంతబతుకూ బతికి అన్నట్లుగా తయారయ్యింది. అరివీరభయంకర హిట్టర్లు విరాట్ కొహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి ప్రపంచ మేటి బ్యాట్స్ మన్, స్పిన్ జాదూ యజువేంద్ర చాహల్, ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ లాంటి మొనగాడు బౌలర్లున్నా…ఆరుకు ఆరుమ్యాచ్ లూ ఓడి…లీగ్ టేబుల్ అట్టుడుగు స్థానానికి పడిపోయింది.

కొహ్లీ కెప్టెన్సీకి ఏమయ్యింది?

కెప్టెన్ గా టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించడం ద్వారా విజయవంతమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొన్న విరాట్ కొహ్లీ… ఐపీఎల్ లో మాత్రం… బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సారథిగా పరాజయం వెంట పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వస్తోంది.

ఓటమితో బోణీ….

డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడిన తొలిరౌండ్ మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కేవలం 70 పరుగులకే కుప్పకూలి…7 వికెట్ల ఘోరపరాజయం చవిచూడాల్సి వచ్చింది.

ఇక..ముంబై ఇండియన్స్ జరిగిన రెండోరౌండ్ మ్యాచ్ హైస్కోరింగ్ తో సాగింది. కొహ్లీ-డివిలియర్స్ భారీ భాగస్వామ్యం సాధించినా.. బ్యాక్ టు బ్యాక్ పరాజయాలు తప్పలేదు.

హైదరాబాద్ సన్ రైజర్స్ తో ముగిసిన మూడోరౌండ్ పోటీలో వార్నర్, బెయిర్ స్టో మెరుపు సెంచరీలతో చెలరేగిపోడంతో.. బెంగళూరు 118 పరుగుల భారీ ఓటమిని ఎదుర్కొనాల్సి వచ్చింది.

ఆ తర్వాత…రాజస్తాన్ రాయల్స్ తో ముగిసిన నాలుగోరౌండ్ పోటీలో సైతం బెంగళూరుకు పరాజయం తప్పలేదు.

ఆరుమ్యాచ్ ల్లో ఒకే హాఫ్ సెంచరీ….

జట్టుగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మాత్రమే కాదు… కెప్టెన్ గా విరాట్ కొహ్లీ సైతం ఏమంత గొప్పగా రాణించలేదు. కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ సాధించాడు.

2016 ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్ లు ఆడిన కొహ్లీ… నాలుగు సెంచరీలతో సహా 973 పరుగులు సాధించాడు. అయితే అదే జోరును ప్రస్తుత ఐపీఎల్ లో… అదీ ప్రపంచకప్ కు ముందు కొహ్లీ కొనసాగించలేకపోడం… ఆందోళన కలిగిస్తోంది.

డివిలియర్స్ దీ అదే సీన్….

బెంగళూరు రాయల్ చాలెంజర్స్ స్టార్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ సైతం స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. ఆరు ఇన్నింగ్స్ లో రెండు హాఫ్ సెంచరీలతో 173 పరుగులు మాత్రమే సాధించాడు. బౌలింగ్ లోనూ బెంగళూరు బౌలర్ల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.

లీగ్ దశలో మిగిలిన ఎనిమిది రౌండ్లలోనూ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వరుస విజయాలు సాధించగలిగితేనే ప్లే ఆఫ్ రౌండ్ చేరుకోగలుగుతుంది. అది సాధ్యం కావాలంటే ఏదైనా అద్భుతమే జరిగితీరాలి.