వన్డే ప్రపంచకప్ కు 15న భారతజట్టు ఎంపిక

  • రెండోడౌన్ స్థానంపైనే టీమ్ మేనేజ్ మెంట్ మథనం
  • గాల్లో దీపంలా మారిన అంబటి రాయుడి బెర్త్
  • మే 30నుంచి ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ప్రపంచకప్

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగే 2019 వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే మాజీ చాంపియన్ టీమిండియా జట్టును….ఈనెల 15న బీసీసీఐ ఎంపిక సంఘం ఖరారు చేయనుంది.

విరాట్ కొహ్లీ నాయకత్వంలోని జట్టు కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. జట్టులోని అత్యధిక స్థానాలు ఇప్పటికే దాదాపుగా ఖరారయ్యాయి.

అయితే…రెండోడౌన్ స్థానం కోసం గతంలో తెలుగుతేజం అంబటి రాయుడు పేరు ఖాయమని భావించినా…. ప్రస్తుతం రాయుడి ఫామ్ అంతంత మాత్రంగా ఉండడంతో…మయాంక్ అగర్వాల్, అజింక్యా రహానే, మనీష్ పాండే పేర్లను సైతం సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు.

ఐపీఎల్ ప్రదర్శనతో జట్టు ఎంపికకు ఏమాత్రం సంబంధంలేదని…కెప్టెన్ విరాట్ కొహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రి చెబుతున్నారు. మే 30 నుంచి జులై 14 వరకూ జరిగే ఈటోర్నీ ప్రారంభమ్యాచ్ లో జూన్ 5న సౌతాఫ్రికాతో జరిగే పోటీలో మాజీ చాంపియన్ టీమిండియా తలపడనుంది.

టీమిండియాకు 1983, 2011 ప్రపంచకప్ టోర్నీలు నెగ్గిన ఘనత ఉంది. ఇంగ్లండ్ వేదికగా ముగిసిన 1983 ప్రపంచకప్ లో కపిల్ దేవ్ నాయకత్వంలో తొలిసారిగా ట్రోఫీ అందుకొన్న టీమిండియా… రెండోసారి విజేతగా నిలవడానికి..2011 వరకూ వేచిచూడాల్సి వచ్చింది. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక టైటిల్స్ సాధించిన రికార్డు మాత్రం ఆస్ట్రేలియా పేరుతో ఉంది.