ఐపీఎల్ ఫైనల్ వేదిక ఉప్పల్ స్టేడియం?

ప్రస్తుతం ఐపీఎల్ 12వ సీజన్ నడోస్తోంది. సగం మ్యాచులు కూడా కాలేదు కానీ ఐపీఎల్ యాజమాన్యం మాత్రం ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలను నిర్ణయించే పనిలో పడ్డాయి. సాధారణంగా ఫైనల్ మ్యాచ్ గత ఏడాది విజేత హోం గ్రౌండ్‌లో జరుగుతుంది. ఈ లెక్కన గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ విజేత కనుక ఈ సారి ఫైనల్ చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరగాల్సి ఉంది.

కాగా, గత ఏడేళ్లుగా చేపాక్ (ఎంఏ చిదంబరం) స్టేడియం స్టాండ్స్ విషయంలో చెన్నై కార్పొరేషన్‌తో వివాదం నెలకొని ఉంది. 12వేల సామర్థ్యం కలిగిన ఈ స్టాండ్స్‌ను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ 2012లో నిర్మించింది. అయితే వీటికి ఎలాంటి అనుమతులు లేవని ఆ స్టాండ్స్‌ను వినియోగించడంపై చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ నిషేధం విధించింది. దీంతో ఇక్కడ ఏ మ్యాచ్ జరిగినా ఆ స్టాండ్స్ మాత్రం ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

12వేల సీట్లను కోల్పోవడం అంటే ఐపీఎల్ యాజమాన్యంతో పాటు సీఎస్కే యాజమాన్యానికి కూడా ఆర్థిక పరంగా ఎంతో నష్టం కలుగుతోంది. దీంతో ఫైనల్ మ్యాచ్‌ను వేరే చోటుకు తరలించాలని భావిస్తున్నారు.

చెన్నై మున్సిపల్ కార్పొరేషన్‌తో ఉన్న వివాదాన్ని వారం రోజుల లోపు పరిష్కరించుకోవాలని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌కు బీసీసీఐ అల్టిమేటం జారీ చేసింది. సమస్య పరిష్కారం కాకపోతే ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియానికి, ప్లేఆఫ్ మ్యాచులు బెంగళూరులోని చినస్వామి స్టేడియానికి తరలించాలని బీసీసీఐ సీవోఏ నిర్ణయం తీసుకుంది.