మల్కంబ్ కు మంచిరోజులు !

  • పోల్ జిమ్నాస్టిక్స్ కు మరో పేరు మల్కంబ్
  • కొయ్య స్తంభంపై కళ్లు చెదిరే విన్యాసాలు
  • ప్రపంచ స్థాయికి ఎదిగిన 12వ శతాబ్దపు క్రీడ

భిన్నజాతులు, మతాల ప్రజలతో…భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్ లో….క్రీడలు సైతం ఎంతో భిన్నంగా, వైవిధ్యభరితంగా ఉంటాయి. సాంప్రదాయ క్రీడలు, గ్రామీణ క్రీడలు, అంతర్జాతీయ క్రీడలు… ఇలా ఎన్నో రకాల క్రీడలు మనకు కనిపిస్తాయి. అయితే… వ్యాయామక్రీడగా, పోల్ జిమ్నాస్టిక్స్ గా పేరుపొందిన మల్కంబ్ క్రీడకు సైతం మంచిరోజులొచ్చాయి. ప్రపంచస్థాయిలో మల్కంబ్ క్రీడల్ని నిర్వహించడమే కాదు… ఐపీఎల్ తరహాలో మల్కంబ్ లీగ్ ను సైతం నిర్వహించడానికి రంగం సిద్ధమవుతోంది.

భారత్…సువిశాలమైన దేశం, జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం మాత్రమే కాదు….సుసంపన్నమైన చరిత్ర కలిగిన దేశం కూడా. అంతేకాదు…వైవిధ్యభరితమైన క్రీడలకు సైతం భారత్ నెలవు కూడా.

టెన్నిస్ , క్రికెట్, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్ లాంటి అంతర్జాతీయ క్రీడలు, …హాకీ, బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, కుస్తీ, విలువిద్య, జిమ్నాస్టిక్స్ లాంటి జాతీయ క్రీడలు, ఖో-ఖో, మల్కంబ్ లాంటి సాంప్రదాయ క్రీడలతో అలరారుతున్న దేశం భారత్ మాత్రమే.

ప్రపంచీకరణతో…..

ప్రపంచీకరణ పుణ్యమా అంటూ భారత క్రీడారంగంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకొన్నాయి. క్రికెట్, ఫుట్ బాల్,హాకీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ లాంటి గ్లోబల్ గేమ్స్ తో పాటు… కుస్తీ, వాలీబాల్, కబడ్డీ లాంటి క్రీడల్లో సైతం ప్రొఫెషనల్ లీగ్ లు జోరుగా సాగిపోతున్నాయి.

ఈ లీగ్ లతో క్రీడాకారులకు ఆర్ధికభద్రతతో పాటు…జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో గుర్తింపు సైతం దక్కుతోంది. దేశంలోని కొన్ని ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఖో-ఖో, మల్కంబ్ లాంటి క్రీడలు సైతం…ప్రొఫెషనల్ లీగ్ ల వైపు చూస్తున్నాయి.

ఏమీటి మల్కంబ్?

మల్కంబ్ పేరులోనే మల్లయోధుల క్రీడ అన్న భావన కలిగించే ఈ క్రీడను పోల్ జిమ్నాస్టిక్స్ గా కూడా పిలుస్తూ ఉంటారు. నేలపైన పాతిన ఓ కొయ్యస్తంభంపై వేలాడుతూ…వివిధ భంగిమల్లో క్రీడాకారులు ివిన్యాసాలు చేయటాన్నే మల్కంబ్ గా చెబుతూ ఉంటారు.

12 శతాబ్దకాలం నుంచి భారత ప్రజలకు సుపరిచితమైన ఈ పురాతన క్రీడలో తాడు సాయంతో చేసే క్రీడను రోప్ మల్కంబ్, కొయ్య స్తంభం పైనే ఆడే క్రీడను పోల్ మల్కంబ్ గా పరిగణిస్తున్నారు.

ఈ క్రీడలో రాణించాలంటే…జిమ్నాస్టిక్స్ లో కొద్దిపాటి ప్రవేశం ఉండితీరాలి. శరీరాన్ని విల్లులా వంచే నైపుణ్యం, చెక్కుచెదరని ఏకాగ్రత, శారీరక పటుత్వం, శరీరంపై నియంత్రణ ఉన్నవారు మాత్రమే… మల్కంబ్ క్రీడలో రాణించగలుగుతారు.

మల్కంబ్ క్రీడ అభివృద్ధి కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ప్రత్యేక క్రీడాసంఘాలున్నాయి. మనదేశంలో 1958 లో నిర్వహించిన తొలి జాతీయ జిమ్నాస్టిక్స్ లో భాగంగా మల్కంబ్ ను తొలిసారిగా ప్రవేశపెట్టారు.

భారత జిమ్నాస్టిక్స్ పర్యవేక్షణలోనే జాతీయ మల్కంబ్ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అంతర్జాతీయస్థాయిలో మాత్రం ప్రపంచ మల్కంబ్ సమాఖ్య ప్రపంచ స్థాయి పోటీలను నిర్వహిస్తూ వస్తోంది.

విదేశాలలో సైతం….

భారత సాంప్రదాయక్రీడ మల్కంబ్ కు ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, చైనా లాంటి దేశాలలో సైతం ఆదరణ ఉంది. 2004లో స్పెయిన్ వేదికగా ప్రపంచ మొట్టమొదటి మల్కంబ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో భారత్ తిరుగులేని విజేతగా నిలిచింది.

ముంబైలో 2019 ప్రపంచ మల్కంబ్…

ముంబైలోని శివాజీపార్క్ వేదికగా ఇటీవలే ప్రపంచ మల్కంబ్ పోటీలు విజయవంతంగా నిర్వహించారు. ఈ టోర్నీలో ఆతిథ్యభారత్ తో సహా…మొత్తం 15 దేశాల జట్లు, క్రీడాకారులు తలపడ్డారు.

స్పెయిన్, జర్మనీ, చెక్ రిపబ్లిక్, ఇటలీ, అమెరికా, ఇరాన్, నార్వే, ఇంగ్లండ్, ఫ్రాన్స్, మలేసియా, సింగపూర్, జపాన్, వియత్నాం, బహ్రెన్, భారత క్రీడాకారులు పురుషుల, మహిళల విభాగాలలో తమ నైపుణ్యాన్ని చాటుకొన్నారు.

టీమ్ విభాగంలో భారత్ మొత్తం 244. 73 పాయింట్లతో విజేతగా నిలిచింది. 44.45 పాయింట్లతో సింగపూర్ రెండు, 30.22 పాయింట్లతో మలేసియా మూడుస్థానాలు సాధించాయి. పురుషుల, మహిళల విభాగాలలో భారత క్రీడాకారులు ప్రదర్శించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకొన్నాయి.

అయితే…మల్కంబ్ క్రీడ ప్రపంచస్థాయిలో విస్తరించాలంటే…ఐపీఎల్ తరహాలో లీగ్ నిర్వహించడం మినహా వేరే దారి లేదని భారత జిమ్నాస్టిక్స్ సంఘం ప్రతినిధులు అంటున్నారు.

శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యాన్ని కలిగించే, ఏమాత్రం క్రీడాపరికరాలు, ఖర్చు లేని ఈ క్రీడను పాఠశాలలో స్థాయి నుంచే ప్రవేశపెట్టాలని…కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు నిపుణులు సూచిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మానసపుత్రిక.. ఖేలో ఇండియా క్రీడల్లో  సైతం మల్కంబ్ ను విస్త్రుతంగా నిర్వహించాలని సలహా ఇస్తున్నారు.

ప్రపంచంలోనే యువజన జనాభా ఎక్కువగా ఉన్న దేశం భారత్ లో…. జేబులు గుల్ల చేసే  క్రికెట్ లాంటి క్రీడల కంటే….ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే మల్కంబ్ లాంటి సాంప్రదాయ క్రీడల అవసరం ఎంతైనా ఉందని…ఇటు కేంద్రప్రభుత్వం, అటు రాష్ట్రప్రభుత్వాలు గుర్తించి తీరాల్సిన సమయం రానే వచ్చింది.